సింగిల్‌గనే: ఆల్ ఇన్ వన్ కేసీఆర్

సింగిల్‌గనే: ఆల్ ఇన్ వన్ కేసీఆర్
  • ముఖ్యమంత్రిగా 60 రోజులు పూర్తి
  • అన్నీ తానే అయి ప్రభుత్వ పరిపాలన
  • ఏడాదిగా అటు సర్కారు, ఇటు రాజకీయం
  • ముందస్తు, అభ్యర్థుల ప్రకటనతో సంచలనం
  • వరుస విజయాలతో ప్రత్యేకమైన ముద్ర
  • కేసీఆర్ నిర్ణయాలను గమనిస్తున్న దేశం
  • పలు రాష్ట్రాలకు ఆదర్శంగా విధానాలు
  • కేబినెట్ ఏర్పాటులోనూ కొత్త ఆలోచన
  • వరుసగా ప్రభుత్వ శాఖల సమీక్షలు
  • బడ్జెట్‌ కూడా స్వయంగా ప్రవేశపెట్టే చాన్స్

మన స్టేట్ల సియాసత్‌, కారోబార్‌‌ ఏడాది సంది సీఎం కేసీఆర్‌‌ సార్‌‌ సుట్టే తిరుగుతున్నయ్‌.  ముందుగాల్నె ఎలక్షన్లకు బోవాలన్నఐడియా వచ్చిన కాడ్నించి స్ట్రాటజీలు జేసి, ప్రచారం సగవెట్టి, అప్పోజిషనోళ్లను మొసమర్లకుండ జేసిండు. కొత్త కొత్త స్కీములతోని దేశమంతా తన దిక్కు తిరిగెటట్టు జేసిండు. మస్తు మెజార్టీతోని పార్టీని మళ్లా పవర్లకు తెచ్చిండు. ఒక్కడే వరుసవెట్టి డిపార్ట్‌‌మెంట్ల మీద రివ్యూలు జేసుకుంట ఆఫీసర్లను హైబత్‌ తినిపిస్తున్నడు. 60 దినాల్నుంచి సీఎం ఒంటి చేత సర్కార్‌‌ను నడిపిస్తున్న తీరుజూసి అందరూ అప్సోస్‌ అయితుండ్రు.

హైదరాబాద్‌, వెలుగు: పాలనలో లోటు రావద్దు.. పార్టీ యాక్టివిటీ ఆగిపోవద్దు.. కొత్త పథకాలు రావాలి.. ఉన్న పథకాలు కొనసాగాలి.. ప్రభుత్వ వ్యతిరేకత రాకూడదు… ప్రతిపక్షం వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు… జనంలో ఆదరణ తగ్గకూడదు… ఇవన్నీ ఒకేసారి సాధిస్తూ… ఒంటిచేత్తో అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్న ఒకే ఒక్కడు… సీఎం కే సీఆర్. రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఏడాది కాలంగా అటు పాలనపరంగా, ఇటు రాజకీయంగా అన్నీ తానే అయి నడిపిస్తున్న ఆయన రెండోసారి సీఎంగా 60 రోజులు పూర్తిచేసుకున్నారు. పాలనను ఒంటిచేత్తో నడిపిస్తూ… సమీక్షలు, పర్యటనలతో అన్ని పనులు చక్కబె డుతున్నారు. ఈ పనితీరు, నిర్ణయాలు తీసుకునే విధానమే ఇతర రాష్ట్రాల నేతలకు ఆదర్శంగా మారుతున్నాయి. పలు రాష్ట్రాలతో పాటు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రైతుబంధు తరహాలో ‘కిసాన్ సమ్మాన్’ పథకం ప్రకటించడం కే సీఆర్ ఎఫెక్ట్ ను మరోసారి ని రూపించింది.
60 రోజుల పాలన
సీఎం కేసీఆర్ ఆదివారంతో 60 రోజుల పాలన పూర్తిచేసుకున్నారు. డిసెంబర్‌ 13న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన ఆయన ఒంటి చేత్తో పాలన సాగిస్తున్నారు. పాలన వ్యవహారాల్లో ఏ లోటు రాకుండా చూస్తున్నారు. తనతో పాటు మహమూద్‌ అలీతో ప్రమాణం చేయించిన ఆయన ఆ తర్వాత విస్తరణ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అన్ని శాఖలపైనా వరుసగా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఏ శాఖకు సంబంధించిన అంశమైనా లోతైన అవగాహనతో ఆయన తీసుకునే నిర్ణయాలను చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

సీఎంగా ప్రమాణం చేసిన రెండో రోజే కీలకమైన నీటిపారుదల శాఖపై కేసీఆర్ సమీక్ష చేశారు. ఆ సమావేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయించి, వెళ్లి వచ్చారు. తర్వాత బడ్జెట్‌, వ్యవసాయం, మిషన్‌ భగీరథ, వైద్యం , పర్యావరణం, అడవులు, హరితహారం, పంచాయితీ రాజ్‌ శాఖలతో పాటు హైదరాబాద్‌ అభివృద్ధిపై వరుస సమీక్షలు చేశారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐదేండ్ల విజన్ తో ప్రణాళికలు వేయాలని ఆదేశించారు. పనులన్నిటికీ డెడ్ లైన్లు పెట్టారు. చివరికి పంచాయతీరాజ్‌ శాఖ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది రిసోర్స్‌ పర్సన్లను గుర్తించి వారికి ఏడు గంటల పాటు శిక్షణ ఇచ్చారు. గ్రామాభివృద్ధి జరగాల్సిన తీరును వివరించారు. పూర్తిస్థాయి మంత్రివర్గం లేకున్నా ఎక్కడా సమస్యలు
తలెత్తకుండా పాలనను సాగిస్తున్నారు.
ఒంటరిగానే ముందుకు
మొదటి నుంచీ పాలనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ ఏడాదిగా సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. కొత్త పథకాల అమలు, ఇటు రాజకీయ నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒంటరిగా, స్వతంత్రంగా ఆయన తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే రేపాయి. పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారాయి. ఏడాది కింద రైతుబంధును ప్రకటించి అమలు చేశారు. ఎన్నికలకు ముందు రెండో విడత సాయమూ అందించారు. రైతులకు పెట్టుబడి సాయం పథకం ఫలితాలు చూసి పలు రాష్ట్రాలూ ఇలాంటి పథకాలే ప్రకటించాయి. చివరికి కేంద్రంలో మోడీ సర్కారూ ఇదే తరహాలో ‘పీఎం కిసా న్ సమ్మాన్’ పథకాన్ని ప్రకటించారు.

అంతకంటే ముందు అసెంబ్లీని ముందుగా రద్దుచేసి ఎన్నికలను పోవాలన్న కేసీఆర్ నిర్ణయం సంచలనం రేపింది. చాలా మంది టీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ తన మాటనే నమ్ముకున్నారు. అసెంబ్లీని రద్దు చేసి అదే రోజు దాదాపుగా సిట్టింగ్ లకే ఖరారు చేస్తూ 105 మంది లిస్ట్ ప్రకటించారు. ఈ నిర్ణయమూ సరికాదని కొందరన్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ ఒక్కరే భుజాలకెత్తుకున్నారు. తన పేరే గెలిపిస్తుందని అభ్యర్థులకు ధైర్యం చెప్పారు. ప్రచారంలో అంతా తానై వందకు పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తూ సభలు నిర్వహిం చారు. రోజుకు ఐదారు సభలూ నిర్వహించిన సందర్భాలున్నాయి. అనుకున్నట్లుగానే విజయం అందుకోవడంతో పాటు గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించారు. కేసీఆర్‌ పథకాలే గులాబీని నిలబెట్టాయని విశ్లేషణలు వచ్చాయి. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల నేతలు ఆరా తీశారు. తెలంగాణ తరహా  పథకాలను అనుసరిస్తూ వారూ స్కీములు మొదలుపెట్టారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ రైతుబంధు తరహాలో ‘అన్నదా తా సుఖీభవ’ పేరుతో ఇటీవలే పథకాన్ని ప్రకటించారు. పెన్షన్లను రెట్టింపు చేశారు.
ఇద్దరితో మంత్రివర్గం
మంత్రివర్గం ఏర్పాటులోనూ కేసీఆర్‌ తనదైన శైలిని ఫాలో అయ్యారు. తనతో పాటు ప్రమాణం చేయించిన మహమూద్ అలీకి హోం శాఖ కేటాయించారు. వరుసగా అన్ని శాఖలపైనా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గం లేదనే భావన రాకుండా పాలన సాగేలా చూస్తున్నారు. పాలన చేపట్టాక ఇప్పటి వరకు వివిధ శాఖలపై 15 సమీక్షలు నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకున్నారు. కాళేశ్వరం,
మిషన్‌ భగీరథలకు డెడ్‌లైన్‌ పెట్టారు. అడవుల సంక్షరణ కోసం ప్రత్యేక దళాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలప అక్రమాలకు పాల్పడితే టీఆర్ఎస్ నేతలైనా సరే కేసులు పెట్టాలని చెప్పారు. అటవీ శాఖలో ఏకంగా 200 మందిని బదిలి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే జైల్లో పెడతామని కేసీఆర్ హెచ్చరిం చారు.

మంత్రివర్గం విషయంలో కలిసి పనిచేయాల్సి న విభాగాలను అనుసంధానం చేస్తూ శాఖలను కుదిం చే ప్రక్రియ చేస్తున్నారు. దీంతో సమర్థంగా పనిచేసేలా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతానికి ఈసారి బడ్జెట్ ను కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గోప్యంగా ఉంచడం కేసీఆర్‌కే చెల్లిందని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయి.

విలక్షణమైన పనితీరు
కేసీఆర్‌ తన పనితీరుతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన నిర్ణయాలు తీసుకునే తీరును పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. అధికార పక్షాలకు ప్రజా వ్యతిరేకత తప్పదనే భావనను ఆయన
పటాపంచలు చేశారు. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ సాధించి విస్మయంలో పడేశారు. ఒంటి చేత్తో పాలన చక్కబెడుతూనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కోల్ కతా, ఒడిశా వెళ్లి మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ కు జాతీయ ఎజెండా ఆలోచనను వివరించి వచ్చారు. ఈ పర్యటనలో ముందుగా ఏపీలోని విశాఖపట్నం వెళ్లినప్పుడు అక్కడ భారీగా జనం స్వాగతం పలికారు. దేశంలో పలువురు నేతలు కేసీఆర్‌ విజన్‌ను ప్రశంసించారు. అటు పాలనలో, ఇటు రాజకీయంగా ఏం చేసినా ఆయన ఒక్కడే చేయగలరనే పేరు తెచ్చుకుంటున్నారు.