
పద్మారావునగర్, వెలుగు: విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో తెలియని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, సాయం చేయడానికి వచ్చే వారిని అడ్డుకోవడం వారి చిల్లర రాజకీయానికి నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కోట నీలిమ అన్నారు. శుక్రవారం ఆమె ట్రాఫిక్ పోలీస్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద పర్యటించారు.
హైదరాబాద్లో వరద సమస్యకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. భారీ వర్షాల సమయంలో హైడ్రా అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని కొనియాడారు. బల్కంపేట అండర్పాస్ బ్రిడ్జి కింద వచ్చిన వరదల్లో ఇటీవల యువకుడు మృతిచెందడం బాధాకరమన్నారు.
వరదల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడడం సరికాదన్నారు. వారి తీరుతో సేవలకు అంతరాయం కలుగుతోందన్నారు.