మహిళా బిల్లు ప్రకటన మాత్రమే: నెట్టా డిసౌజా

 మహిళా బిల్లు  ప్రకటన మాత్రమే: నెట్టా డిసౌజా

హైదరాబాద్, వెలుగు : కొత్త పార్లమెంట్​వేదికగా మహిళలను కేంద్రం మోసం చేసిందని ఆలిండియా మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఆరోపించారు. మహిళా బిల్లుపై ప్రధాని మోదీ కేవలం ఒక ప్రకటన మాత్రమే చేశారని, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఆయనకు లేదని విమర్శించారు.  2034కి ముందు నారీశక్తి వందన్​ బిల్లు  అమలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. అయినా ఎప్పుడో అమలు చేసేదానిపై ఇప్పుడు పార్లమెంట్ ​ప్రత్యేక సెషన్​ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

సోమవారం ఆమె గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లులను లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో పెట్టాలని మహిళలు వీధుల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. పదేండ్లుగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు సడన్​గా బిల్లును ఎందుకు పెట్టిందని నిలదీశారు. బిల్లు అమలుకు జనాభా లెక్కలు, డీలిమిటేషన్​తో ఎందుకు లింకు పెడుతున్నారో చెప్పాలన్నారు.