మేమెంతో మాకన్ని.. సీట్లు ఇయ్యాలి : అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్‌‌

మేమెంతో మాకన్ని.. సీట్లు ఇయ్యాలి : అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్‌‌

ఎల్బీ నగర్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన పద్మశాలీలకు సీట్లు ఇవ్వాలని అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్‌‌ చేసింది. ఆదివారం హైదరాబాద్‌‌లోని సరూర్‌‌‌‌ నగర్‌‌‌‌ స్టేడియంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌‌‌‌ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ పద్మశాలి రాజకీయ శంఖారావం బహిరంగ సభకు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాతం జనాభా ఉన్న పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకన్ని సీట్లు కేటాయించాలని కోరారు. 

పద్మశాలి సమాజానికి ఏ రాజకీయ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తుందో.. ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ సమాజాన్ని గుర్తించే రాజకీయ పార్టీలను మాత్రమే పద్మశాలి సమాజం ఆదరిస్తుంది, గౌరవిస్తుందని చెప్పారు. పోటీలో ఉన్న పద్మశాలి అభ్యర్థులకు మాత్రమే తాము ఓటేస్తామని, తమ వాళ్లు పోటీ లేని చోట నోటాకు ఓటేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తికి ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందని, తమ నాయకుడు ఎల్.రమణకు ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభలో పలు తీర్మానాలు చేశారు. 

పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి..

రాజకీయ రంగంతోపాటు వ్యాపార రంగంలో కూడా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని బీఆర్ఎస్‌‌ నేత ఎల్‌‌.రమణ కోరారు. టెక్ట్స్‌‌టైల్స్‌‌, హ్యాండ్లూమ్‌‌ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించినా.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌‌‌‌, కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలోని చేనేత రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు, కటకం నర్సింగరావు, గుజ్జ సత్యం, రాష్ట్ర మహిళా కార్యదర్శి రావిరాల సంధ్యారాణి, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతుల, పున్నా గణేశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి..

రాష్ట్రంలో 8 శాతం జనాభా ఉన్న పద్మశాలీలకు ఆరు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌‌ స్థానాలు కేటాయించాలి. రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలి. పంచాయతీ నుంచి పార్లమెంట్‌‌ స్థాయి వరకు సముచిత స్థానం కల్పించాలి. గతంలోఉన్న చేనేత జౌళి శాఖను పునరుద్ధరించాలి. అలాగే, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, పద్మశాలి డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వృత్తుల్లో కొనసాగుతున్న 90 శాతం పద్మశాలీలకు ఉపాధి, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలి. అలాగే, చేనేత బంధు ప్రకటించాలి.