కార్గో షిప్‌‌‌‌‌‌‌‌హైజాక్ కథ సుఖాంతం.. అసలేం జరిగిందంటే

కార్గో షిప్‌‌‌‌‌‌‌‌హైజాక్ కథ సుఖాంతం.. అసలేం జరిగిందంటే
  • 15 మంది ఇండియన్లు సహా 21 మంది సురక్షితం
  • గురువారం సాయంత్రం ‘ఎంవీ లిలా నార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోక్‌‌‌‌‌‌‌‌’ నౌక హైజాక్
  • ఐఎన్ఎస్ చెన్నై షిప్‌‌‌‌‌‌‌‌తో వెంబడించి.. నేవీ ఆపరేషన్
  • షిప్ నుంచి పరారైన హైజాకర్లు!

న్యూఢిల్లీ  :  సోమాలియా తీరంలో హైజాక్‌‌‌‌‌‌‌‌కు గురైన కార్గో షిప్‌‌‌‌‌‌‌‌ను ఇండియన్ నేవీ విడిపించింది. షిప్‌‌‌‌‌‌‌‌లోని 15 మంది ఇండియన్ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడింది. అరేబియా సముద్రంలో వెళ్తున్న ‘ఎంవీ లిలా నార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోక్‌‌‌‌‌‌‌‌’ వాణిజ్య నౌకను గురువారం సాయంత్రం కొందరు హైజాక్ చేయగా.. శుక్రవారం సాయంత్రానికి నౌకను ఇండియన్ నేవీ తన అధీనంలోకి తీసుకుంది. తొలుత ఐఎన్ఎస్ చెన్నై, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌, లాంగ్​ రేంజ్ ప్రిడేటర్ డ్రోన్‌‌‌‌‌‌‌‌ను రంగంలోకి దించగా.. తర్వాత కమాండోలు నౌకలోకి ప్రవేశించారు. అయితే అప్పటికే నౌక నుంచి హైజాకర్లు పరారయ్యారు.

అసలేం జరిగిందంటే..

అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌక ‘ఎంవీ లిలా నార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోక్‌‌‌‌‌‌‌‌’ హైజాక్‌‌‌‌‌‌‌‌కు గురైనట్లు బ్రిటిష్ మిలిటరీకి చెందిన యూకే మ్యారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) గుర్తించింది. ‘‘హైజాక్ అయిన నౌక నుంచి యూకేఎంటీవో పోర్టల్ గుండా ఓ మెసేజ్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు షిప్‌‌‌‌‌‌‌‌లోకి చొరబడినట్లు చెప్పింది. దీంతో వెంటనే మారీటైమ్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ను ఇండియన్ నేవీ మొదలుపెట్టింది. మారీటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం మోహరించిన ఐఎన్ఎస్ చెన్నైను పంపింది” అని నేవీ అధికార ప్రతినిధి వెల్లడించారు. నిఘా కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ను కూడా మోహరించిందని తెలిపారు. హైజాక్ అయిన నౌకను శుక్రవారం మధ్యాహ్నం నార్త్ ఆరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ చెన్నై ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెప్ట్ చేసిందని అధికారులు చెప్పారు. హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. తర్వాత ఆపరేషన్ మొదలుపెట్టిన ‘మార్కోస్’ కమాండోలు.. కార్గో షిప్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారు. అయితే నౌక మొత్తం సెర్చ్ చేసినా ఎవరూ కనిపించలేదని, అప్పటికే హైజాకర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.

ఎర్రసముద్రంలో పేలిన హౌతీ డ్రోన్ బోట్

ఎర్ర సముద్రంలో పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌‌‌‌‌‌‌‌ బోట్‌‌‌‌‌‌‌‌ను హౌతీ రెబెల్స్  పేల్చివేశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అమెరికా నేవీ ప్రకటించింది. ‘‘హౌతీ బోటు వాణిజ్య నౌకలు, అమెరికా నేవీ షిప్‌‌‌‌‌‌‌‌లకు కొన్ని కిలోమీటర్ల దూరంలో పేలింది. ఆ పేలుడును మేమందరం చూశాం” అని వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు.