అడ్డా కూలీల అడ్వాన్స్ బుకింగ్.. హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి లీడర్లు ప్రిపేర్

అడ్డా కూలీల అడ్వాన్స్ బుకింగ్.. హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి లీడర్లు ప్రిపేర్
  • డైలీ రూ.400–రూ.600  ఇచ్చేలా అగ్రిమెంట్ 
  • మూడు పూటలా ఫుడ్, స్పెషల్ ప్యాకేజీలు
  • ఆలస్యమైతే దొరకడం కష్టమని నేతల అలర్ట్  

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొన్ని  రోజుల్లో  రిలీజ్ కానుండగా..  ముందుగానే అన్నిపార్టీల లీడర్లు ప్రచారానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నికల్లో ఎంతో కీలకమైన క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌పైనే  ఎక్కువగా ఫోకస్ పెట్టారు. షెడ్యూల్ వచ్చాక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ర్యాలీలు, సభలు, రోడ్‌‌‌‌‌‌‌‌షోలకు ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా అడ్డా కూలీలను బుక్ చేసుకుంటున్నారు. ఆలస్యమైతే వారు దొరికే పరిస్థితి లేకపోవడంతో నెల రోజుల సమయానికి పార్టీ ప్రచార ర్యాలీల్లో పాల్గొనేందుకు సెట్ చేసుకుంటున్నారు. 

మూడు పూటలా భోజనంతో పాటు రోజుకు మహిళలకు రూ.400 , పురుషులకు రూ.600 ఇచ్చేలా స్పెషల్ ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఎక్కువ ఇచ్చేందుకు మధ్యవర్తులతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సిటీలోని అడ్డా కూలీలతో పాటు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక జిల్లాల నుంచి కూలీలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఉండే కూలీలు తమ జిల్లాల్లో ఉండే వారికి సమాచారం అందిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ ఏదైనా సరే ఎక్కువ ఇచ్చే అభ్యర్థి ఎవరైతే వారికే ప్రచారం చేసేందుకు అడ్డా కూలీలు ఆసక్తి చూపుతున్నారు.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 300 లకుపైగా అడ్డాలు ఉండగా,  దాదాపు 3 లక్షల మంది కూలీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  
 
ఎంతో కీలకం కావడంతో..

ఇప్పటికే జాతీయ పార్టీల అగ్రనేతలతో పాటు అధికార బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో సహా అన్ని పార్టీలు ఎన్నికల  ప్రచారం చేస్తున్నాయి.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  కొన్ని ప్రాంతాల్లో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తున్నారు.  ఈ నెల మొదటి వారంలో షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జోరుగా నడుస్తుండగా.. ఆయా పార్టీల కార్యకర్తలు నేతల వెంట  తిరుగుతున్నారు. అన్ని పార్టీలు బూత్, వార్డు ఆఫీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండటంతో పాటు కింది స్థాయి క్యాడర్ బిజీ అయింది. ఇక రోజువారీ పనులకు అడ్డా మీదకు వచ్చే కూలీలు సైతం ఇప్పుడు ప్రచారంలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే కొంతకాలం వారికి ఉపాధిగా మారనుంది. మరో వైపు మహిళా సంఘాల సభ్యులను కూడా ప్రచారానికి వినియోగించుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మహిళా ఓటర్లు వారికి దగ్గరగా ఉంటుండడంతో  తమకు ఎంతో  కొంత మేలు జరుగుతుందని మహిళా సంఘాల వారితో సంప్రదింపులు చేస్తున్నారు. తమ పార్టీకే మద్దతు తెలపాలని కొన్ని చోట్ల ఇప్పటికే కొందరు లీడర్లు  మహిళా సంఘాలను కలిసి మాట్లాడినట్లు తెలిసింది. 

షెడ్యూల్ విడుదలైతే కూలీలు దొరుకుడు కష్టమే..

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అడ్డా కూలీలు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే కొన్ని సెగ్మెంట్ల లీడర్లు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్, ఎల్​బీనగర్, ఉప్పల్, పటాన్ చెరువు, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు నెల రోజులకు అడ్డా కూలీలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువ జనాలు కనిపించేలా ఉండేందుకు అన్ని పార్టీల నేతలు చూసుకుంటున్నారు. కొన్ని చోట్ల క్యాండిడేట్లు కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ బలాన్ని పార్టీ అధిష్టానానికి చూపించేందుకు సిద్ధమవుతున్నారు.