అగ్రి చట్టాల రద్దుకు ఒకే బిల్లు

అగ్రి చట్టాల రద్దుకు ఒకే బిల్లు
  • రెడీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఒకే బిల్లుతో పార్లమెంటులో రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం సమగ్రంగా ఒక బిల్లును ప్రిపేర్ చేస్తోంది. ఈ బిల్లు డ్రాఫ్ట్ పూర్తయిన తర్వాత ప్రధాన మంత్రి ఆఫీస్ ఆమోదం తెలపాల్సి ఉందని ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మూడు చట్టాలను రద్దు చేసేందుకు మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని తొలుత భావించినా, సమగ్రంగా ఒకే బిల్లును ప్రవేశపెట్టి చట్టాలను రద్దు చేయడంపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపాయి. అలాగే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి లీగల్ గ్యారంటీ ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్ నూ కేంద్రం పరిశీలిస్తోంది. మద్దతు ధర విషయంలో గైడ్ లైన్స్ జారీ చేస్తే సరిపోతుందా? లేక ప్రత్యేక చట్టం తీసుకురావాల్నా? అనే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.

కొత్త చట్టాలతో ఏర్పడిన అన్ని బోర్డులూ క్లోజ్..

కేంద్ర ప్రభుత్వం నిరుడు జూన్ లో కొత్తగా తెచ్చిన మూడు అగ్రి చట్టాలను రైతుల డిమాండ్ల మేరకు రద్దు చేస్తామని ప్రధాని మోడీ ఈ నెల 19న ప్రకటించారు. అయితే, ఆర్డినెన్స్ తో కొత్త అగ్రి చట్టాలు ఆరు నెలల పాటు అమలులో ఉండగా, వాటిని ఆ టైంలో కొన్ని రాష్ట్రాలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాయి. దీంతో కొత్త అగ్రి చట్టాల ప్రకారం ఏర్పాటు చేసిన అన్ని బోర్డులనూ మూసివేసేలా బిల్లులో ప్రొవిజన్స్ చేర్చనున్నారు. ఇప్పటివరకు ఆయా బోర్డులు తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా ఆటోమేటిక్ గా రద్దయిపోయేలా నిబంధనలు పొందుపర్చనున్నారు. ఈ చట్టాల ప్రకారం ఏవైనా ఆఫీసులను ఏర్పాటు చేసి ఉంటే, వాటి యాక్టివిటీలు కూడా క్లోజ్ అయ్యేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చనున్నారు.

28న ఆల్ పార్టీ మీటింగ్

  • ప్రధాని మోడీ కూడా హాజరయ్యే చాన్స్ 

పార్లమెంట్ వింటర్ సెషన్ సమావేశాలు ఈ నెల 29 ప్రారంభం కానున్నందున, 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చింది. ఉభయ సభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను మీటింగ్ కు ఆహ్వానించింది. ప్రధాని మోడీ కూడా మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. మీటింగ్ కు ప్రభుత్వ ప్రతినిధులుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా అటెండ్ కానున్నారు. అగ్రి చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించినందున, వింటర్ సెషన్ సమావేశాల్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చట్టాల రద్దు కోసం రూపొందించిన బిల్లును కేబినెట్ బుధవారం ఆమోదించే అవకాశం ఉంది.