
ఇండియా.. సకల మతాలకు నెలవు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే నినాదం మన దేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలుపుతుంది. ఈ దేశం ఎవరిది? అన్న ప్రశ్న వేస్తే చెప్పే జవాబేంటి? ‘అందరిది’! 75 శాతం మంది ఇదే మాటన్నారు. ముస్లింలకు జాతీయ భావం ఎక్కువని చెప్పారు. కానీ, అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియా వాడే వాళ్లు ఏమంటున్నారో తెలుసా? ‘హిందువులదే ఇండియా’ అంటున్నారు. లోక్‌నీతి–సీఎస్డీఎస్ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. దేశ రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతో తెలుసుకునేందుకు ఐదేళ్ల పాటు సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఒకసారి చూసేద్దాం
అన్ని మతాలది ఇండియా
‘ఇండియా కేవలం హిందువులదే’.. ఇదీ అప్పుడప్పుడు సోషల్ మీడియా వాడుతున్న వారి అభిప్రాయం మరి. రెండు వర్గాల యూజర్లు మాత్రమే ఇండియా హిందువుల దేశం అని నమ్ముతున్నారు. వారానికోసారి సోషల్ మీడియా వాడేవాళ్లు, ఎప్పుడో అరుదుగా మాత్రమే సోషల్ మీడియా వాడే వాళ్లు మాత్రమే అలా అనుకుంటున్నారు. 19 శాతం మంది యూజర్లలో అదే భావన నాటుకుపోయింది. సోషల్ మీడియా వాడని వాళ్లు 17 శాతం మందిది ఇండియా హిందువులదే అని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వాడుతున్న 75 శాతం మంది ఓటర్లు దేశం అన్ని మతాల వారిది అని నమ్ముతుంటే, వాడని వాళ్లలో 73 శాతం మందిది అదే నమ్మకం. అన్ని వర్గాల వారిని లెక్కలోకి తీసుకుంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ఇండియా అన్ని మతాల వారిది అని నమ్ముతున్నారు. 14 నుంచి 17 శాతం మంది మాత్రం కేవలం హిందువులదని భావిస్తున్నారు.
సోషల్‌మీడియాను వాడని వారితో పోలిస్తే వాడుతున్న వారు.. ‘ముస్లింలకు జాతీయ భావం’ ఎక్కువని భావిస్తున్నారు.
న్యూస్ తగ్గిపోయింది
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో సంప్రదాయ మీడియా వాడకం బాగా తగ్గిందని సర్వే తేల్చింది. పేపర్ చదవడం, న్యూస్ చానెళ్లు చూడడం తగ్గిందని పేర్కొంది. 2014లో 29 శాతం మంది న్యూస్‌ను ఫాలో అవుతామని చెబితే, 2019 నాటికి అది 18 శాతానికి పడిపోయింది. భవిష్యత్ వార్తా ప్రపంచం సోషల్ మీడియానే అని చాలా మంది యూజర్లు భావిస్తున్నారు. అయితే, రాజకీయాల కోసం మాత్రం సోషల్ మీడియాను వాడుకోబోమని యూజర్లు చెబుతున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే దాని ద్వారా రాజకీయ అభిప్రాయాలను వెల్లడిస్తామంటున్నారు. 20 శాతం మంది మాత్రమే రాజకీయ వార్తలను ఫార్వర్డ్ చేయడమో లేదంటే షేర్ చేయడమో చేస్తామంటున్నారు.
వృద్ధులకు చోటు లేదు
సోషల్ మీడియాను మొత్తం యువతే దున్నేస్తోంది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు మాత్రమే ఎక్కువగా దానిని వాడుతున్నారు. 26% మంది ఆ వయసు వాళ్లు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. వాళ్లతో పోలిస్తే 26–35 ఏళ్ల మధ్య ఉన్న 15% మంది మాత్రమే దానిని వాడుతున్నారు. 23–25 ఏళ్ల మధ్య ఉన్న 23% మందికి సోషల్ మీడియా అంటే ఇష్టం. 18–25 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు 60 % మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. 26–35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లైతే కేవలం 46% మందికే వాట్సాప్ ఉంది. వృద్ధులైతే అసలు సోషల్ మీడియా వాడకం చాలా చాలా తక్కువ. వారికి అందులో చోటు లేదు. 2018తో పోలిస్తే ఇన్స్టాగ్రాం వాడకం పెరిగిపోయింది. గత ఏడాది 18–25 ఏళ్ల మధ్య ఉన్న యువత ఇన్‌స్టాగ్రాంను 20% వాడితే.. ఈ ఏడాది అది 28 శాతానికి పెరిగింది. ప్రతి నలుగురిలో ఒకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మబోమని తేల్చి చెప్పారు.
‘అప్పర్’దే సోషల్
సోషల్ మీడియాలో అగ్రవర్ణాల (పెద్ద కులాలు) హవానే కొనసాగుతోంది. దళితులు, గిరిజనులతో పోలిస్తే సోషల్ మీడియా వాడుతున్న పెద్దకులపోళ్లు రెట్టింపున్నారు. 15 శాతం మంది పెద్దకులపోళ్లు సోషల్ మీడియా వాడుతుంటే, దళితులు 8 శాతం, గిరిజనులు 7 శాతం మంది సోషల్ సైట్లు బాగా వాడుతున్నారు. 9 శాతం మంది బీసీలు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అసలు దాని ఊసే తెలియని పెద్ద కులపోళ్లు 54 శాతం కాగా, 75 శాతం మంది గిరిజనులు, 71 శాతం మంది దళితులకు దాని గురించి తెలియదు. ఈ విషయంలోనూ తేడా చాలానే ఉంది. అయితే, ఆర్థికంగా దళితులు, గిరిజనుల కన్నా ముస్లింలు వెనకబడే ఉన్నా, సోషల్ మీడియా వాడకంలో మాత్రం ముందున్నారు. హిందువుల్లోని పెద్ద కులపోళ్ల తర్వాత ముస్లింలదే రెండో స్థానం. ముస్లింలలో ప్రతి ఐదుగురిలో ఒకరు సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఒక్కొక్క సోషల్ మీడియా సైట్‌ను లెక్కలోకి తీసుకున్నా అగ్రవర్ణాలు, ముస్లింల హవానే కొనసాగుతోందని సర్వే పేర్కొంది. ఐదేళ్లుగా ఇది స్థిరంగా ఉంటోందని చెప్పింది.