
దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మోడీ సర్కార్ అసమర్ధ విధానాల వల్లే జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిందని అన్నారు. ఉత్పత్తి రంగం పూర్తిగా తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం జీడీపీపై ఎక్కువగా పడిందన్నారు మన్మోహన్ సింగ్. ఉపాధి లేక యువత రోడ్డున పడ్డారని చెప్పారు. రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు మాజీ ప్రధాని. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మాని.. ప్రమాదంలో ఉన్న ఆర్థిక రంగ పురోగతికి చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సింగ్ సూచించారు.
GDP వృద్ధిరేటు గడిచిన ఏడేళ్లలో అత్యంత కనిష్టం 5శాతంగా నమోదు కావడంపై ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు మన్మోహన్. భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళన కరంగా ఉందనీ.. మోడీ ప్రభుత్వం ఆల్ రౌండ్ మిస్ మానేజ్ మెంట్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ పతనం ఇండియాకు మంచిది కాదన్నారు.