తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పల్లెల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం ముమ్మరం చేశారు అభ్యర్థులు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలతో పల్లెల్లో సందడి నెలకొనగా.. మరి కొన్ని చోట్ల హోరాహోరీ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఆ ఊళ్ళో సర్పంచ్ బరిలో ఉన్నోళ్లంతా అన్నదమ్మలు, బావబామ్మర్దులే.
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బెస్తపల్లి గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకే కులవృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఈ గ్రామంలో ఉన్నోళ్లంతా వరుసకు అన్నదమ్ములు, బావ బామ్మర్దులే కావడం విశేషం. ఈ గ్రామంలో అందరూ చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నారు.రాష్ట్రంలో బేస్త సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఒకే దగ్గర ఉన్న గ్రామం బెస్తపల్లి. ఈ గ్రామ జనాభా 630. పురుషులు 310 మంది, స్త్రీలు 320 మంది ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం ఓటర్లు 472 మంది. పురుష ఓటర్లు 223 మంది, స్త్రీలు 249 మంది. అటువంటి బెస్తాపల్లి గ్రామం ఎన్నికల సందర్భంగా ఎంతో ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటది.
నేటి కాలంలో వారి కులవృత్తికి కట్టుపడి జీవనోపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే ఐదు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గ్రామ ప్రత్యేక ఏమిటంటే ఈ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలు ఒకే కులం, రక్త సంబంధీకులు కావడం విశేషం. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తామని ఎవరికి వారే దీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయడం కోసం వలస వెళ్లిన వారు గ్రామానికి చేరుకుంటారని అభ్యర్థులు పేర్కొన్నారు.
