ఆల్ ది బెస్ట్.. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

ఆల్ ది బెస్ట్.. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ ​ఫస్ట్ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్లకు వచ్చేందుకు స్టూడెంట్లకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఉదయం 9:35 గంటల తర్వాత సెంటర్లలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. స్టూడెంట్లు ఉదయం 8:30 గంటల కల్లా సెంటర్లకు రావాలని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏపీలో క్వశ్చన్ పేపర్ లీకైన నేపథ్యంలో మన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

రెండేండ్ల తర్వాత పరీక్షలు 

రాష్ట్రవ్యాప్తంగా 11,401 స్కూళ్లకు చెందిన 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 2,58,098 మంది మగ పిల్లలు.. 2,51,177 మంది ఆడ పిల్లలు ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిలోనూ సీసీ కెమెరాలు పెట్టారు. పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ రూమ్​లో సీసీ కెమెరాల ముందే క్వశ్చన్ పేపర్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా హైదరాబాద్​జిల్లాలో 75,083 మంది, రంగారెడ్డిలో 47,558 మంది, మేడ్చల్​లో 43,261 మంది, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,774 మంది, ములుగులో 3,399 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2020, 2021లో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగలేదు.

 

స్టూడెంట్లకు టెన్త్ బోర్డు సూచనలివీ... 
ఉదయం 8:30 గంటల కల్లా హాల్ టికెట్​తో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9:35 గంటల తర్వాత లోపలికి అనుమతించరు.  పరీక్ష రాసేందుకు స్టూడెంట్లు రైటింగ్ ప్యాడ్స్ తీసుకెళ్లాలి. సరిపడా పెన్నులు, రబ్బర్లు, పెన్సిళ్లు, స్కేల్ తదితరాలు తీసుకెళ్లొచ్చు.  ఇన్విజిలేటర్ మెయిన్ ఆన్సర్ బుక్ కి జత చేసి ఇచ్చిన ఓఎంఆర్ తమదో కాదో చూసుకోవాలి. వేరే వాళ్లది వస్తే వెంటనే ఇన్విజిలేటర్​కు చెప్పాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే దాంట్లోని ప్రతి పేజీపై తప్పనిసరిగా హాల్​టికెట్ నంబర్ రాయాలి.  అడిషనల్ ఆన్సర్ షీట్లు, గ్రాఫ్, బిట్ పేపర్లను మెయిన్ ఆన్సర్ షీట్​కు గట్టిగా దారంతో కట్టాలి. ఆన్సర్ ​షీట్​పై ఉన్న సీరియల్ నంబర్ ను అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. బాగా తెలిసిన ఆన్సర్స్​ ముందు రాయాలి. చేతిరాత అర్థమయ్యేలా ఉండాలి. సెంటర్​లోకి సెల్​ఫోన్లు, స్మార్ట్ వాచ్​లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దు.

  • మొత్తం విద్యార్థులు    5,09,275
  • పరీక్షా కేంద్రాలు    2,861 
  • ఇన్విజిలేటర్లు    33,000 
  • ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్​లు    144 
  • కంట్రోల్ రూమ్ నంబర్       040–23230942