సర్కారు బడుల్లో ఫస్ట్ క్లాసు అడ్మిషన్లు తగ్గాయి

సర్కారు బడుల్లో ఫస్ట్ క్లాసు అడ్మిషన్లు తగ్గాయి

హైదరాబాద్, వెలుగు: మన ఊరు మన బడి స్కీమ్ కింద బడుల్లో ఫెసిలిటీస్​ కల్పిస్తున్నం. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్​ మీడియం క్లాసులు స్టార్ట్ చేస్తున్నం. దీంతో ఈ ఏడాది సర్కారు బడుల్లో మస్తు అడ్మిషన్లు వస్తాయని కలలుగన్న సర్కారు పెద్దల అంచనాలన్నీ తారుమారయ్యాయి. నిరుడితో పోలిస్తే సగం అడ్మిషన్లు కూడా కాలేదు. సర్కారు బడుల్లో ఇప్పటి వరకూ 1.72 లక్షల మంది మాత్రమే చేరారు. ప్రైవేటు నుంచి సర్కారులో చేరే వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో సర్కారు పెద్దలు, ఉన్నతాధికారుల్లోనూ అయోమయం నెలకొన్నది. 

రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరం జూన్13న ప్రారంభమైంది. అంతకుముందే జూన్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరుతో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1,72,613 మంది విద్యార్థులు మాత్రమే సర్కారు స్కూళ్లలో చేరారు. నిరుడు మూడున్నర లక్షల మంది స్టూడెంట్లు సర్కారు బడుల్లో చేరారు. దీంట్లో రెండున్నర లక్షలకు పైగా ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చిన వారే. అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకూ 61వేల మంది మాత్రమే ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. వెయ్యికి పైగా అడ్మిషన్లు ఉన్నవి 33 హైస్కూల్స్ లో మాత్రమే.  ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో ఒక్క స్కూల్​కూడా ఈ జాబితాలో లేదు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 250 నుంచి 1000 లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 161 మాత్రమే కాగా.. హైస్కూల్స్ మాత్రం 2572 ఉన్నాయి. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే స్కూళ్లు రాష్ట్రంలో 100 వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. 

ఫస్ట్​ క్లాస్​లో సగం మంది కూడా చేరలే...

ఈ ఏడాది సర్కారు బడుల్లో ఫస్ట్ క్లాసు అడ్మిషన్లు చాలా తగ్గాయి. నిరుడితో పోలిస్తే సగం కూడా కాలేదు. గత ఏడాది ఒకటో తరగతిలో 3,18,108 మంది చేరితే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 1.16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చేరారు. దీంట్లో అత్యధికంగా 83 వేల మంది అంగన్​వాడీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఫస్ట్ క్లాసులో చేరిన వారిలో ప్రైవేటు నుంచి వచ్చింది పదివేల మంది మాత్రమే. ఈ ఏడాది మన ఊరు మన బడి, 8వ తరగతి వరకూ ఇంగ్లీష్​ మీడియం తరగతులను ప్రారంభించిన సర్కారు.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. వీటి ప్రభావం అడ్మిషన్లపై ఏమీ పడలేదని తెలుస్తోంది. మరోపక్క నిరుడు ప్రైవేటు బడుల నుంచి సర్కారులో చేరిన స్టూడెంట్లు కూడా మళ్లీ ప్రైవేటు బాటే పట్టారని టీచర్లు చెబుతున్నారు. సర్కారు బడుల్లో 
సరిపడ టీచర్లు లేకపోవడంతో పాటు గత సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్స్​ఇవ్వకపోవడమూ మరో కారణమని టీచర్లు పేర్కొంటున్నారు.