ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిన్రు : భట్టి ఫైర్

ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిన్రు : భట్టి ఫైర్
  • రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు.. బీఆర్ఎస్​పై భట్టి ఫైర్
  • ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిచ్చినం
  • ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తం
  • మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి

ఖమ్మం/ఎర్రుపాలెం, వెలుగు :  ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్​కు అప్పగిస్తే పదేండ్లలో ఖజానాను ఖాళీ చేసిందని, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి భవిష్యత్​తరాలను కూడా తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి క్వార్టర్ నిధులను కూడా ఎన్నికలకు ముందే డ్రా చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఫైర్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన సభలో భట్టి పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘‘మేము ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. కానీ వారి కలలను నిజం కానివ్వం. మా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా నిండలేదు. అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యామంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి” అని మండిపడ్డారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఉండలేకపోతున్నారని విమర్శించారు. ‘‘పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి, అవి కూడా ఇవ్వలేదు. మేం హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేస్తాం” అని చెప్పారు.

విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తం..

ఆరు గ్యారంటీల అమలుకు కావాల్సిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ‘ప్రజాపాలన’ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భట్టి తెలిపారు. ‘‘ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం. తెలంగాణ యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తాం. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కూళ్ల ఏర్పాటు కోసం ప్రతి మండల కేంద్రంలో భూములను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పోటీకి అనుగుణంగా తెలంగాణ బిడ్డలను తీర్చిదిద్దుతామన్నారు. ‘‘బనిగండ్లపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన కాలేజీ నిర్మాణానికి, గ్రామంలో రెండు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తాం. ఇక్కడి పీహెచ్ సీని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. అన్ని సౌకర్యాలు కల్పించి,
వైద్యారోగ్య సిబ్బందిని నియమిస్తాం” అని హామీ ఇచ్చారు.

విద్యుత్ రంగంపై లక్ష కోట్ల భారం మోపిన్రు..

‘కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా?’ అని ఎన్నికల టైమ్ లో బీఆర్ఎస్ ఎంత ప్రచారం చేసినా... ‘కరెంటు కావాలి.. కాంగ్రెస్ కావాలి’ అని ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని భట్టి అన్నారు. ‘‘2014కు ముందున్న ప్రభుత్వాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తే, అవి ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత అది తమ గొప్పతనమేనని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన రెండు పవర్ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభమే కాలేదు. అలాంటప్పుడు వాళ్లు కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అవుట్ డేటెడ్ టెక్నాలజీతో నిర్మించారు. దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. విద్యుత్ రంగంపై రూ.1.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు” అని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించి, ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.