రాజస్థాన్లో కాంగ్రెస్ ఆశలన్నీ కులగణనపైనే..!

రాజస్థాన్లో కాంగ్రెస్ ఆశలన్నీ కులగణనపైనే..!
  • మళ్లీ అధికారం చేపట్టాక నిర్వహిస్తామని హామీ
  • ఓబీసీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం..
  • పైలట్​ను పక్కన పెట్టడంతో  గుజ్జర్ల ఆగ్రహం

జైపూర్: రాజస్థాన్​లోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే 2 రోజుల ముందు కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతుందని ఈ నెల 7న ప్రకటించింది. దీంతో ఈ  ప్రకటన అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కులాల మద్దతుతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కుల గణన చేస్తామన్న ప్రకటన.. ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుంది..? గెహ్లాట్​కు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంది.

కులాల ఓట్లే కీలకం

2011 లెక్కల ప్రకారం.. రాజస్థాన్ మొత్తం జనాభాలో దళితులు 17.80%, ఆదివాసీలు 13.50% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కుల గణన చేపట్టలేదు. 2013, 2018లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్​డీఎస్) చేపట్టిన సర్వే ప్రకారం.. రాజస్థాన్​లో ఓబీసీలు సుమారు 35 నుంచి 40% ఉంటారని తేలింది. ఓబీసీ కేటగిరీలో జాట్​లు 10%  నుంచి 12% వరకు ఉంటారు. దళితుల్లోని జాతవ్ కమ్యూనిటీలో మేఘ్వాల్, బైర్వా సబ్ గ్రూప్​లు  9% నుంచి 10% ఉంటారు. అప్పర్ క్యాస్ట్ గ్రూప్​లోని రాజ్​పుత్​లు 9%, బ్రాహ్మణులు 6% వరకు ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్​లో మీనస్​లు 50%, బిల్స్ 40% ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మీనస్​లు 6.50%, బిల్స్​లు 5% దాకా ఉన్నారు. ఇక, ముస్లింలు 9% ఉన్నారు. 

కుల గణనతో ఎవరికి లాభం?

రాజస్థాన్​లో 16% సీట్లు ఎస్సీలకు, 12% సీట్లు ఎస్టీలకు, ఓబీసీల కోసం 21% సీట్లు రిజర్వ్ చేశారు. అగ్రవర్ణాలతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2019లో గెహ్లాట్ ప్రభుత్వం మోస్ట్ బ్యాక్​వర్డ్ క్యాస్ట్ కేటగిరిలో ఉన్న గుజ్జర్లు, బంజారాలు, గడియా లోహార్స్, రైకాస్​తో పాటు గడారియాలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. తర్వాత 2023, ఆగస్టులో కాంగ్రెస్ సర్కార్ ఎంబీసీలకు 6% రిజర్వేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 70శాతానికి చేరాయి. నాన్​జాట్ ఓబీసీలు మొత్తం జనాభాలో 20శాతానికి పైగా ఉన్నారు. రాజకీయంగా వీరే కాంగ్రెస్​కు ఎంతో కీలకం.

రాజస్థాన్ రాజకీయ చరిత్రే వేరు

బీహార్, యూపీ లాంటి సోషల్ జస్టిస్ బేస్డ్ పొలిటికల్ హిస్టరీ రాజస్థాన్​కు లేదు. 1920 కాలంలో షేఖావతి, మేవార్ రీజియన్లలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. షెఖావతి, మార్వార్​లోని కొంత భాగంలో జాట్ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండేది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ తమకు అనుకూలంగా లేదంటూ రాజ్​పుత్​లోని మెజార్టీ వర్గం రామ రాజ్య పరిషత్(ఆర్ఆర్​పీ), జన్​సంఘ్​కు మద్దతు ఇచ్చాయి. తర్వాత రాజ్​పుత్​లు అందరూ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిపోయారు.

వర్క్​ఔట్ అవుతుందా?

దళిత, ఆదివాసీ, ముస్లిం, నాన్ డామినేట్ ఓబీసీ, జాట్​ల ఓట్లు అశోక్ గెహ్లాట్ గెలుపును డిసైడ్ చేయనున్నాయి. గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన సచిన్ పైలట్​ను అశోక్ గెహ్లాట్ పక్కనపెట్టడం మైనస్​గా ఉంది. రావణ రాజ్​పుత్, గ్యాంగ్​స్టర్ ఆనంద్ ​పాల్ సింగ్ ఎన్​కౌంటర్ చేయడంతో పోయిన సారి రాజ్​పుత్​లు కాంగ్రెస్ వైపు మళ్లారు. జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని స్టేట్ చీఫ్​గా నియమించి అసంతృప్తిని కొంత తగ్గించుకుంది. కుల గణన అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.