కవిత క్యాడర్ యూ టర్న్!

కవిత క్యాడర్ యూ టర్న్!
  • లిక్కర్ స్కాంతో  మారిన తీరు
  • కేటీఆర్​ చుట్టే స్థానిక బీఆర్​ఎస్​ లీడర్లు
  • మంత్రి ఫైనల్ చేసిన సభ్యులకే జగిత్యాల జడ్పీ పీఠం 

జగిత్యాల, వెలుగు : 
నిజామాబాద్ ​పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లాలో ఒకప్పుడు కవిత క్యాడర్​గా ముద్రపడ్డ లీడర్లంతా క్రమంగా కేటీఆర్ వైపు మొగ్గుతున్నారు. నిజామాబాద్​ ఎంపీగా, ఆతర్వాత ఎమ్మెల్సీగా జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గంపై కవిత  తనదైన మార్క్​ వేసుకున్నారు.  ఇద్దరు ఎమ్మెల్యేలు విద్యాసాగర్​రావు, సంజయ్​ కవితవర్గంగానే గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో పాటు సెకండ్​క్యాడర్​ లీడర్లంతా పదవులు, అభివృద్ధి పనులు, ఇతరత్రా అవసరాల కోసం కవిత వద్దకు పరుగు పెట్టేవారు. కానీ ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ తర్వాత కవిత ప్రాభవం తగ్గడంతో ప్రస్తుతం నేతల చూపు మంత్రి కేటీఆర్ వైపు మళ్లింది. దీంతో ప్రతి పని కోసం ఇటీవల ఆయన​ దగ్గరికే వెళ్తుండడం ఆసక్తిరేపుతోంది. జగిత్యాల జడ్పీ చైర్​పర్సన్​ ఎంపిక వ్యవహారం కూడా కేటీఆర్​ దగ్గరే పెండింగ్​ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

పట్టు తప్పుతోంది? 

నిజామాబాద్ ఎంపీగా పని చేసిన కవిత   జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్  బలోపేతానికి  కీలక పాత్ర పోషించారు.  కింది స్థాయి కార్యకర్తల నుంచి చైర్మన్​ల దాకా క్యాడర్​ను కాపాడుకున్నారు.    కానీ,  లిక్కర్​ స్కామ్​కేసు కవిత ఇమేజ్​ను  స్థానికంగా దెబ్బతీసింది. ఎంపీగా గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకూ స్థానిక లీడర్లంతా ఏ పనికైనా కవితనే కలిసేవారు.  కానీ,  ఇటీవల జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా తో ఆ పదవి ఆశావహులు  మినిస్టర్ కేటీఆర్ చుట్టే  ప్రదక్షిణాలు  చేస్తున్నట్టు  తెలుస్తోంది.  గత మూడు రోజులుగా జగిత్యాల కొత్త చైర్ పర్సన్ అభ్యర్థిగా ఓ కాపు వర్గానికి చెందిన వారిని  మినిస్టర్ కేటీఆర్ దాదాపు ఫైనల్ చేశారనే ప్రచారం జోరందుకుంది. 

మళ్లీ తెర మీదకు చైర్ పర్సన్ సీటు 

ఈ నెల 6న జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో నియోజకవర్గ స్థాయి లీడర్లు రహస్య సమావేశమై జగిత్యాల చైర్ పర్సన్ పై అభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.  పదవి కోసం ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరిగిన ఆశావాహులకు నిరాశే ఎదరైందని లీడర్లు అంటున్నారు. దీంతో  మినిస్టర్ కేటీఆర్ దగ్గరికి వెళ్లడం తో ఆయన డిసిషనే ఫైనల్ గా మారిందనేది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 

జగిత్యాల, కోరుట్లలో కవితకు  క్యాడర్

జగిత్యాల, కోరు ట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూ బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కవిత  కృషి చేశారు.  ముఖ్యంగా కాం గ్రెస్ కంచు కోట గా ఉన్న జగిత్యాల  నియోజకర్గంలో టీఆర్​ఎస్​ గెలుపు కోసం గ్రామ గ్రామానికి వెళ్లి   ప్రజలను కలిశారు.  కవిత ప్రభావమే స్థానికంగా బలోపేతానికి కారణమని  లీడర్ల అభిప్రాయం.  అదే  బీఆర్ఎస్ వర్గాల్లో  జోష్   నింపింది.   బీఆర్ఎస్ యూత్ లీడర్ దావ సురేశ్​  భార్యకు జడ్పీ  చైర్ పర్సన్ పదవి కట్టపెట్టడం, మున్సిపల్ చైర్ పర్సన్ గా భోగ శ్రావణి నియమాకం లో కవిత పాత్ర కీలకంగా ఉంది.

2018 లో పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటమితో కొన్ని రోజులు దూరంగా ఉన్న కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆక్టివ్ గా లేక పోవడంతో  క్యాడర్​ ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత కు ముఖ్య అనుచరులుగా పేరున్న కోరుట్ల నియోజకవర్గం లోని ఓ జడ్పీటీసీ,  మరో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లకు స్థానిక ఎమ్మెల్యేతో పొసగలేదు.  ఆ కారణంతోనే వారు పార్టీ  నుంచి బయటకు వచ్చినట్లు విమర్శలున్నాయి.  దీనికి తోడు కవిత పై లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం తో క్యాడర్ మరింత దూరం అయినట్లు ప్రచారం జోరందుకుంది.