ప్రజలంతా ఏకమై కేసీఆర్ ను గద్దె దించాల్సిందే : పాశం యాదగిరి

ప్రజలంతా ఏకమై కేసీఆర్ ను గద్దె దించాల్సిందే : పాశం యాదగిరి

ఖైరతాబాద్, వెలుగు :  రాష్ట్ర ప్రజలంతా ఏకమై.. సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిందేనని సీనియర్​ జర్నలిస్ట్​ పాశం యాదగిరి అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. ‘కేసీఆర్​ను గద్దె దించే సమావేశం’ పేరుతో తెలంగాణ నిరుద్యోగ రక్షణ (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీటింగ్​కు పాశం యాదగిరి హాజరై మాట్లాడారు.

 ‘‘మేడిగడ్డ కొట్టుకు పోతే.. లేదంటున్నడు.. క్వశ్చన్​ పేపర్లు​ లీక్ ​కాలేదట.. ప్రవళిక ఆత్మహత్య చేసుకోలేదట.. ఇలా కేసీఆర్​ అన్నీ అబద్ధాలే చెప్తున్నడు. ఆ మేడిగడ్డే కేసీఆర్​కు బొందల గడ్డ అయితది. 42 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నరు.. వారంతా కేసీఆర్​కు వ్యతికేంగా ఓట్లు వేస్తే ఎమైతడు.. అందరూ ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్​ను ఓడించాలే..’’ అని యాదగిరి అన్నారు. ఉద్యోగ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 61ఏండ్లకు పెంచడంతో మహబూబాద్​పరిధిలోని గండెంగకు చెందిన సునీల్​ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. 

ఆ సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తమని చెప్పి.. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా సునీల్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బిడ్డలారా.. ఉద్యోగాలు రాకున్నా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం అడ్వొకేట్​ శరత్​కుమార్,​ కళాకారులు పృధ్వీ రాజ్, విష్ణు, రమేశ్, జడ్సన్ మాట్లాడారు. బీఆర్ఎస్​ను ఓడించేందుకు పాటల ద్వారా ఓటర్లను చైతన్య పర్చేందుకు బస్సు యాత్రను చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. కేసీఆర్​ ఫ్యామిలీ హటావో..  తెలంగాణ బచావో నినాదంతో ముందుకు పోతామన్నారు.