
- బీహార్ కేబినెట్ విస్తరణలో పదవులన్నీ జేడీయూకే
కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తాజాగా బీజేపీకి పంచ్ ఇచ్చారు. ఆదివారం రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించిన ఆయన, కొత్తగా ఎనిమిది మంది జేడీయూ నేతలకు మంత్రిపదవులిచ్చుకున్నారు. బీజేపీ, ఎల్జేపీకి విస్తరణలో చోటుదక్కలేదు. నితీశ్ ఆఫర్ చేసిన ఒకే ఒక్క బెర్త్‌ను తీసుకునేందుకు బీజేపీ నిరాకరించింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టండన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీలన్నీ హాజరుకావడం గమనార్హం. ‘‘ఒక పోస్ట్ తీసుకోమని సీఎం కోరారు. కానీ తర్వాత తీసుకుంటామని చెప్పాం’’అని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ తెలిపారు. కేంద్ర కేబినెట్లో చేరిక విషయమై బీజేపీతో ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేసిన సీఎం నితీశ్, ‘‘పొత్తు కుదిరినప్పుడే ఏ పార్టీ ఎన్ని మంత్రి పదవులు, ఏ శాఖలు కేటాయించాలో డిసైడ్ చేసుకున్నాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీయూ కోటాలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవాళ్టి విస్తరణతో వాటిని భర్తీ చేశాం”అని వివరించారు.