జర్నలిస్టులే టార్గెట్: గాజా పై ఇజ్రాయెల్ మెరుపు దాడి, కెమరామెన్ సహా 5 మృతి..

జర్నలిస్టులే టార్గెట్: గాజా పై ఇజ్రాయెల్ మెరుపు దాడి, కెమరామెన్ సహా 5 మృతి..

గత కొంతకాలంగా ఇజ్రాయెల్ గాజా మధ్య సాగుతున్న యుద్ధంలో ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మరణించిన సంగతి మరవక ముందే  గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి దగ్గర జరిగిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతి చెందారు. ఈ దాడిని ఇజ్రాయెల్ జరిపినట్లు అల్ జజీరా న్యూస్ ఛానెల్ తెలిపింది. మరణించినవారిలో  న్యూస్ కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మహమ్మద్ క్రీఖే సహా  కెమెరామెన్‌లు ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మహమ్మద్ నౌఫాల్ ఉన్నారని చెప్పింది. ఆసుపత్రి బయట ప్రెస్‌కు ఏర్పాటు చేసిన టెంట్ టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. అల్ జజీరా న్యూస్ యాంకర్ ఒకరు తన సహచరుల మరణ వార్తను ప్రకటిస్తూ కన్నీళ్లతో కనిపించిన ఒక క్లిప్ వైరల్ కూడా అయ్యింది.

దాడి జరిగిన కొద్దిసే పటికే ఇజ్రాయెల్ సైన్యం అనాస్ అల్-షరీఫ్‌ను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లు అంగీకరించింది. అనాస్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ఒక ఉగ్రవాది, అతను హమాస్‌లోని ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని తెలిపింది. 

చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 28 ఏళ్ల అల్-షరీఫ్ Xలో గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయని పోస్ట్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అకౌంట్ నుండి ఒక స్నేహితుడు ముందుగానే రాసి ఉంచిన ఒక పోస్ట్ షేర్ అయ్యింది.  నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపి నా గొంతును అణచివేయడంలో విజయం సాధించిందని తెలుసుకోండి అని  పోస్ట్‌లో ఉంది.

మీడియా సంస్థల ప్రకారం గాజాలో జరుగుతున్న 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులపై జరిగిన ఈ దాడి తాజాగా జరిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 200 మంది మీడియా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

అనాస్ అల్-షరీఫ్ ఎవరు: అనాస్ అల్-షరీఫ్ గాజాలో పనిచేస్తున్న అల్ జజీరాలో అత్యంత గుర్తింపు పొందిన రిపోర్టర్లలో ఒకరు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాపై దాడికి ఆమోదం తెలిపిన తర్వాత అల్-షరీఫ్ గాజా నగరంపై ఇజ్రాయెల్ బాంబు దాడి గురించి Xలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, అల్ జజీరా మధ్య చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. గాజాలో తాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అధికారులు ఆ దేశంలో అల్ జజీరా ఛానెల్‌ను నిషేధించారు, అలాగే అల్ జజీరా ఆఫీసుపై దాడులు చేశారు.