అయ్యయ్యో..టమాటా!.. కిలో రూ.150 అంటే జనాలు కొనట్లే

అయ్యయ్యో..టమాటా!..  కిలో రూ.150 అంటే జనాలు కొనట్లే

వరంగల్‍, వెలుగు:  కిలో రూ.100 దాటిన టమాటను కొనేందుకు జనం ముందుకురాకపోవడం, తక్కువ రేటుకు అమ్మేందుకు వ్యాపారులకు ధైర్యం చాలకపోవడంతో ఈలోగా వర్షాల వల్ల స్టాక్​ అంతా పెట్టెల్లోనే కుళ్లిపోతోంది. కూరగాయల బిజినెస్‍కు ఎంతో ఫేమస్‍గా చెప్పుకునే వరంగల్‍ లక్ష్మీపురం మార్కెట్ లో టమాటా అమ్మకాలు  పావువంతుకు పడిపోయాయి. ఈక్రమంలో మురుగుతున్న టమాటలను దాచలేక వ్యాపారులు మున్సిపాలిటీ ట్రాక్టర్లలో పారబోస్తుండగా, పేదలు ఏరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

 రెండు నెలల్లో.. కిలో రూ.15 నుంచి రూ.150

ఈ వేసవిలో కిలో టమాటా మార్కెట్ లో రూ.15 నుంచి 20 మధ్య పలికింది. అలాంటిది కేవలం రెండు నెలల్లోనే రికార్డ్​ స్థాయిలో పది రెట్లు పెరిగి ఏకంగా కిలో రూ.150 కి చేరింది.  ఏప్రిల్‍, మే నెలల్లో టమాట ధరలు 20, ఆలోపే ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో దాదాపు 25 రోజులపాటు అకాల వర్షాలు కురవడంతో టమాట తోటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మే నెలఖరు కల్లా ధర రూ.40 వరకు పెరిగింది. వానలు ఆలస్యం కావడంతో ఉన్న తోటలు ఎండిపోవడం, కొత్త పంట రాకపోవడంతో డిమాండ్‍ పెరిగి, జూన్‍ 15 నుంచి 20 తేదీల మధ్య రూ.70 నుంచి రూ.80 వరకు చేరింది.  మరో నెల గడిచే సరికి  మళ్లీ డబుల్‍ అయింది. హోల్‍సేల్‍ కూరగాయల షాపుల్లోనే కిలో టమాట రూ.140 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. 

పావువంతుకు పడిపోయిన అమ్మకాలు 

పెరిగిన ధరలను చూసి జనాలు టమాట అంటేనే భయపడ్తున్నారు. వారానికి కిలో కొనేవాళ్లు అర కిలో కంటే తక్కువే కొంటున్నారు. దీంతో అమ్మకాలు తగ్గాయి. రాష్ట్రంలో కూరగాయల అమ్మకాలకు ఫేమస్‍గా భావించే వరంగల్‍ లక్ష్మీపురం మార్కెట్​లో మొన్నటివరకు డైలీ 200 టన్నుల టమాట విక్రయాలు జరగగా.. ఇప్పుడు 30 నుంచి 40 టన్నులు కూడా అమ్ముడుపోవడం లేదు. అదే సమయంలో ఐదు రోజులుగా కురుస్తున్న వానలతో నిల్వ ఉన్న టమాటలు త్వరగా కుళ్లిపోతున్నాయి. గోదాముల్లోని పెట్టెల్లో క్వింటాళ్లకొద్దీ ఉన్న టమాటలు మురిగిపోవడంతో మున్సిపాలిటీ ట్రాక్టర్లలో తెచ్చి పారబోశారు. మరికొందరు అక్కడే ఉండే పశువులకు దాణాగా వేస్తున్నారు. కాగా, వందల రూపాయలు పెట్టి టమాట కొనలేని కొందరు పేదలు  చెత్తలో పోసిన టమాటలలో మంచివి ఏరుకుంటున్నారు.

కుళ్లిపోయి లాస్‍ అయితన్నం

ఇప్పుడు మన దగ్గర పంట లేక కర్నాటక, మదనపల్లె నుంచి ఎక్కువ ధరపెట్టి తీసుకొస్తున్నం. రేటు ఎక్కువని జనాలు కొంటలేరు. ధరకంటే తక్కువ రేటుకు అమ్మలేక.. పాడవుతున్న టమాటను దాచలేక వ్యాపారాలు దెబ్బతింటున్నయ్‍.
– మొగిళి, టమాట వ్యాపారి

సర్కారు సబ్సిడీ ఇయ్యాలే.. 

అప్పట్లో ఏ కూర డినా టమాట కంపల్సరీ వాడినం. రేటు కూడా ఎన్నడూ రూ.20 దాటలేదు. ఇప్పుడు రూ.150 చెబుతున్రు. అదే ధరకు కిలో చికెన్‍ వస్తోంది. ఈ పరిస్థితుల్లో తప్పదనుకుంటేనే టమాట కొంటున్నం. రాష్ట్ర ప్రభుత్వం టమాటపై సబ్సిడీ ఇచ్చి అందుబాటులోకి తేవాలి. 
– బి.సతీశ్, కేయూసీ, హనుమకొండ