జైళ్లకు పోయినోళ్లంతా ఎన్నికల్లో పోటీకి వస్తున్నరు : గంగుల

జైళ్లకు పోయినోళ్లంతా  ఎన్నికల్లో పోటీకి వస్తున్నరు : గంగుల

కరీంనగర్, వెలుగు: వివిధ కేసుల్లో జైళ్లకు పోయినోళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. 30, 40 కేసులున్నోళ్లను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నదని విమర్శించారు. కరీంనగర్​కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం బీడీ టేకేదారులకు కొత్త పింఛన్లు, దివ్యాంగులకు పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ ప్రోగ్రాంకు మంత్రి గంగుల చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే 50 ఏండ్లు వెనక్కి పోతామన్నారు. తెలంగాణ వచ్చాక 144 సెక్షన్లు, కర్ఫ్యూలు, భూకబ్జాలు లేవని, ఒక వేళ కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ భూకబ్జాలు, బంద్ లు, అల్లర్లు, కర్ఫ్యూలు తప్పవని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్, బీజేపీ మన పార్టీలు కాదని, ఢిల్లీ పార్టీలని విమర్శించారు. 

మన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఎలాంటి కల్మషం లేకపోయినా, విధివశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారు దైవ సమానులని, వారు సమాజంలో చులకన భావానికి గురికాకుండా, సగౌరవంతో బతకాలని నెల రూ.4,016 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.  బీడీ టేకేదారులకు రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

 కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ,  కలెక్టర్ డాక్టర్ బి. గోపి,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.