
నల్గొండ, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని అన్ని యూనిట్లను పూర్తి చేసి 2026 జనవరి నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందు కోసం నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో రూ.970 కోట్లతో వైటీపీఎస్ లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్1 లోని ఒకటో యూనిట్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడంలో జాప్యం చేయడం వల్ల రెండేండ్ల పాటు ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగిందని ఫలితంగా ఆర్థిక భారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేవలం రెండు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించామని చెప్పారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులకు అత్యుత్తమ సౌకర్యాలు స్థానికంగా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన స్థానిక ప్రజలకు కూడా థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులకు అందే విద్య, వైద్య సౌకర్యాలను ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన భూనిర్వాసితులు భట్టి విక్రమార్కను కలిశారు. తమకు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని.. ఆ హామీని నెరవేర్చాలని కోరారు. పవర్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన వారికి ఆగస్టు 15లోగా 246మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు భట్టి ప్రకటించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అందని వారికి అందచేస్తామని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీమ సీఎం భరోసా ఇచ్చారు.
రెండేండ్లలోనే 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు: ఉత్తమ్
ప్రతి వారం టార్గెట్ పెట్టి ప్రగతిని సమీక్షించడంతో రెండేండ్లలోనే 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తాను నల్లగొండ ఎంపీగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరైందన్నారు. అయితే 93 కిలోమీటర్ల ఈ డబుల్ లైన్ రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగా నిధులు రాకపోవడతో ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల పూర్తికి రూ.280 కోట్ల మంజూరు చేయడంతో పాటు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, అధికారులు నవీన్ మిట్టల్, ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.