రాష్ట్రంలోని మహిళలంతా సీఎం కేసీఆర్‌‌‌‌ ఫొటోకు రాఖీ కట్టాలి

రాష్ట్రంలోని మహిళలంతా సీఎం కేసీఆర్‌‌‌‌ ఫొటోకు రాఖీ కట్టాలి

మహిళలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలంతా సీఎం కేసీఆర్‌‌‌‌ ఫొటోకు రాఖీ కట్టాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మహిళలకు పెద్దన్న తీరుగా కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అందుకే ఆయన ఫొటోకు రాఖీ కట్టాలన్నారు. గవర్నమెంట్​ స్కీంల ద్వారా లబ్ధి పొందిన మహిళలతో కేటీఆర్‌‌‌‌ గురువారం జూమ్‌‌ కాల్‌‌లో మాట్లాడారు. మహిళల సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. అందుకే శిశువుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి మహిళకు అండగా ఉండేలా స్కీంలు అమలు చేస్తున్నామన్నారు. 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌‌ ఇస్తున్నామని చెప్పారు. కల్యాణ లక్ష్మి, -షాదీ ముబారక్ స్కీం కింద 12.87 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆర్థికంగా భరోసాగా నిలిచామన్నారు. మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాన్ని మిషన్ భగీరథతో పూర్తిగా తీర్చామన్న కేటీఆర్, మన స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ ను కేంద్రం ప్రారంభించిందన్నారు. నామినేటెడ్‌‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తేవాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.