బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్ ఇవే..

బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్ ఇవే..

కూనూర్: తమిళనాడులోని కూనూర్ లో చోటు చేసుకున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీసీ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ రోజు ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్ కు వెళ్తుండగా రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో హెలికాప్టర్ లోని 13 మంది మృత్యువాత పడ్డారు. ఆయన మృతిని నిర్ధారిస్తూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. రావత్ మృతిపై ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రావత్ తన కెరీర్ లో సాధించిన విజయాలు, దేశ త్రివిధ దళాధిపతిగా ఆయన ఎదిగిన తీరు గురించి తెలుసుకుందాం.. 

  • దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా 2020, జనవరి 1న బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. సీడీఎస్ గా నియామకం కావడానికి ముందు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలను నిర్వర్తించారు. 
  • ఉత్తరాఖండ్ లోని పౌరిలో మిలటరీ బ్యాక్ గ్రౌండుకు చెందిన కుటుంబంలో పుట్టాడు. ఆయన డెహ్రాడూన్ లోని కేంబ్రియాన్ హాల్ స్కూల్, సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్స్ లో చదువుకున్నారు. ఆ తర్వాత ఖడక్ వాల్సాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ)తోపాటు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన  చేరారు. 
  • ఇండియన్ మిలిటరీ అకాడమీలో రావత్ కు స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు దక్కింది. ట్రైనింగ్ అనంతరం 1978లో   గోర్ఖా రైఫిల్స్ బెటాలియన్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. చదువులో ఎప్పుడూ ముందుండే రావత్.. డిఫెన్స్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు. అలాగే మద్రాస్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్ పూర్తి చేశారు. 
  • లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ ఏసీ) వద్ద పదాతిదళాలను నడిపిన అనుభవం బిపిన్ రావత్ కు సొంతం. కశ్మీర్ లోయలోనూ ఆయన పదాతిదళాలను సమర్థంగా ముందుకు నడిపారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ కలసి నిర్వహించిన చాప్టర్ 7 మిషన్ లో ఆయన మల్టీనేషనల్ బ్రిగేడ్ గా వ్యవహరించడం విశేషం. 
  • 2015లో మయన్మార్ లో క్రాస్ బార్డర్ ఆపరేషన్ ను సమర్థంగా నిర్వహించడం రావత్ కెరీర్ లో విశేషంగా చెప్పాలి. ఈ మిషన్ లో భాగంగా ఎన్ఎస్సీఎన్ కే మిలిటెంట్లను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ మిషన్ తోపాటు 2016లో పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ప్లానింగ్ లోనూ రావత్ కీలకంగా ఉన్నారు. 
  • 38 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో అపూర్వ సేవలు అందించినందుకు గానూ రావత్ కు పరమ్ విశిష్ట్ సేవా మెడల్ దక్కింది. దీంతోపాటు ఉత్తమ యుద్ధ సేవా పతకం, యుద్ధ సేవా మెడల్, సేనా మెడల్స్ కూడా ఆయన్ను వరించాయి. 
  • జనరల్ బిపిన్ రావత్ భార్య పేరు మధులికా రావత్. ఆర్మీ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఆమె ప్రెసిడెంట్ కావడం గమనార్హం. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తోపాటు మధులికా కూడా మృతి చెందారు. 
  • దేశ రక్షణ, నాయకత్వంపై రావత్ పలు ఆర్టికల్స్ ప్రచురించారు. ఇవి పలు పబ్లికేషన్స్ లో పబ్లిష్ అయ్యాయి.