ఇళ్లు మంజూరు చేయలేదని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

ఇళ్లు మంజూరు చేయలేదని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయాన్ని కొందరు పేదలు ముట్టడించారు. అందరికి ఇల్లు పథకంలో తామంతా డి.డి.లు కట్టామని, అయినా తమకు ఇళ్లు మంజూరు చేయలేదని, తమకు న్యాయం చేయాలని ముట్టడి చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ..  చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండగా.. జి.ఓ.లను కూడా పక్కన పెట్టి , పేదలకు ఇళ్ళు పేరుతో లంచాల రూపంలో మోసం చేసారని ఆరోపించారు. ఈ పథకంలో జి.ఓ.ఎమ్.యెస్. నెం. 264 ప్రకారం ఆరుగురి సభ్యులలో తప్పనిసరిగా ఓ MLA ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ.,  తనకు తెలియకుండా  అప్రోవల్ కి పంపేవారని విమర్శించారు.

1728 మందిని ఎంపిక చెయ్యాల్సి ఉండగా అప్పటి టీడీపీ కౌన్సిల్ జనవరి 30,2019 న లిస్ట్ ఫైనల్ చేసి చైర్మన్ సంతకం, మంత్రిగారి సంతకం తో పాటు కమిషనర్ హైద్రాబాద్ ఆసుపత్రిలో ఉండగా అక్కడికి వెళ్లి కూడా సంతకం చేయించారని  రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. MLA సంతకం లేకుండా మరలా 1728 మందిలో సుమారు 180 మందిని తప్పించి ఫిబ్రవరిలో ఒక లిస్ట్ తయారు చేసి ప్రక్కన పడేశారన్నారు. మంగళగిరిలో 1728 ఇళ్ల నిర్మాణం జరిగితే ఎక్కువ మందితో డీడీ లు కట్టించి అవినీతి చేశారని ఎద్దేవాచేశారు. 1728 మంది లబ్ధిదారులు గాకుండా ఎక్కువ మంది కట్టిన డి.డి.లు గవర్నమెంట్ అకౌంట్లో జమ అయినట్లయితే ఉన్నతాధికారులు తో మాట్లాడి, ఆ డబ్బును వెనక్కు తెప్పించి ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.

రెండు నెలల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి , ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన గృహప్రవేశాలు చేయిస్తామన్నారు ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి.