భారత వివాహ వ్యవస్థను.. నాశనం చేసే యత్నం

భారత వివాహ వ్యవస్థను.. నాశనం చేసే యత్నం
  • భారత వివాహ వ్యవస్థను.. నాశనం చేసే యత్నం
  • ప్రతి సీజన్‌‌లో భాగస్వామిని మార్చడమనేది క్రూరమైన భావన
  • ‘లివ్ ఇన్ రిలేషన్‌‌షిప్స్‌‌’పై అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ/అలహాబాద్: ‘లివ్ ఇన్ రిలేషన్‌‌షిప్స్‌‌’పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలోని వివాహ వ్యవస్థను నాశనం చేసేందుకు ఓ ‘సిస్టమాటిక్ డిజైన్’ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఓ వ్యక్తికి వివాహ వ్యవస్థ ఇచ్చే భద్రత, సామాజిక అంగీకారం, స్థిరత్వం వంటి వాటిని.. లివ్ ఇన్ రిలేషన్‌‌షిప్ ఎన్నటికీ ఇవ్వదు. ప్రతి సీజన్‌‌లో భాగస్వామిని మార్చడమనే క్రూరమైన భావన.. ఒక స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి ముఖ్య లక్షణంగా పరిగణించలేం” అని జస్టిస్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్ చెప్పింది. లివ్ ఇన్ భాగస్వామిని రేప్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది.

 ‘‘ఈ దేశంలో వివాహ వ్యవస్థ అనేది పాతబడిన లేదా వాడుకలో లేని లేదా చెల్లని పరిస్థితుల్లో మాత్రమే లివ్-ఇన్ -రిలేషన్‌‌షిప్ సాధారణమైనదిగా పరిగణనలోకి వస్తుంది. ‘అభివృద్ధి చెందిన’ అని చెప్పుకుంటున్న ఎన్నో దేశాలకు ఇప్పుడు వివాహ వ్యవస్థను రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది’’ అని కామెంట్ చేసింది. దేశంలో లివ్ ఇన్ ట్రెండ్ కొనసాగితే.. భవిష్యత్తులో మనకు మనమే పెద్ద సమస్యను సృష్టించడానికి ముందుకు వెళ్తున్నట్లేనని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వివాహ బంధంలో భాగస్వామికి ద్రోహం చేయడం, స్వేచ్ఛగా లివ్ ఇన్‌‌ రిలేషన్‌‌షిప్‌‌లో జీవించడం వంటివి.. ప్రోగ్రెసెవ్ సొసైటీకి చిహ్నాలుగా చూపుతున్నారు. యువత ఇలాంటి వాటికి ఆకర్షితులవుతారు. వారికి దీర్ఘకాలిక పరిణామాల గురించి తెలియదు” అని చెప్పింది.

ఇదీ కేసు

యూపీలోని సహరణ్‌‌పూర్‌‌‌‌కు చెందిన 19 ఏళ్ల యువతి, అద్నాన్ అనే వ్యక్తి ఏడాదిపాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కాగా, పెళ్లి చేసుకునేందుకు అద్నాన్ నిరాకరించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తనతో శృంగారం చేశాడని, తర్వాత మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో అతడిపై కేసు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో అద్నాన్ అరెస్టు కాగా.. తాజాగా కోర్టు బెయిల్ ఇచ్చింది.