రాజాసింగ్ పై పోలీసుల దాడి అబద్దం.. తానే కొట్టుకున్నాడు

రాజాసింగ్ పై పోలీసుల దాడి అబద్దం.. తానే కొట్టుకున్నాడు

హైదరాబాద్ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో గత(బుధవారం) రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తలకు గాయమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు. రాజా సింగ్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని…ఎమ్మెల్యేనే  తనకు తాను రాయితో కొట్టుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

నిన్న రాత్రి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఓ వర్గం వారు ప్రయత్నించగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రాజాసింగ్, తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా… రాజాసింగ్‌ తలకు గాయమైంది. ఆనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇప్పుడీ వీడియోను విడుదల చేశారు పోలీసులు.

అంతకు ముందు గాయపడిన  ఎమ్మెల్యే రాజాసింగ్ ను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. ఒక ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమానుషమని, ప్రజాప్రతినిధిని రక్తమోడేలా కొట్టడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజా పాలన ఉందా.. రజాకార్ల పాలన కొనసాగుతుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజాసింగ్‌పై దాడికి పాల్పడిన గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్, అసిఫ్ నగర్ ఏసీపీ నర్సింహా రెడ్డి, షాయనాత్ గంజ్ ఎస్సై గురుమూర్తి, రవి కుమార్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.