
- హైడ్రా ప్రజావాణికి 51 కంప్లయింట్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వరద ముంచెత్తే రోడ్లు, కాలనీల ఫొటోలతో సహా నాలాల ఆక్రమణలపై సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. 51 ఫిర్యాదులు రాగా, 30 నాలాల ఆక్రమణలపైనే ఉన్నాయి. హైడ్రా అడిషనల్కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ ఫిర్యాదులను పరిశీలించారు.
ఫిర్యాదులు ఇలా...
చాంద్రాయణగుట్టలోని బార్కాస్ సలాలా ప్రాంతంలోని నాలా మీద ఇల్లు కట్టారని, దీంతో ఏటా వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్కడి నివాసితులు ఫొటోలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలను తొలగిస్తే మూడు బస్తీలకు వరద ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు.
మేడ్చల్–- మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలో పార్కులకి సంబంధించిన 12వేల గజాల స్థలం కబ్జాకు గురవుతోందని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంటీ బేరింగ్స్ నగర్ వాసులు కోరారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఏఆర్‌సీఐ రోడ్డులోని ఆర్ఛిడ్ రెసిడెన్సీ సమీపంలోని పెద్ద చెరువు నాలా కబ్జాలకు గురవ్వడంతో తమ ప్రాంతాలన్ని నీట మునుగుతున్నాయని అక్కడి రెసిడెన్షియల్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని వందనపురి కాలనీ ఫేజ్-1లో 20 అడుగుల రోడ్డును 10 అడుగుల మేర ఎదురుగా ఉన్న ప్లాట్ యజమానులు కబ్జా చేశారంటూ ఫిర్యాదు వచ్చింది. రోడ్డు ఆక్రమణలను తొలగించి లేఅవుట్ ప్రకారం కాపాడాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్ పల్లిలోని ఎస్ఆర్ సదన్ జీకే అవెన్యూ సమీపంలోని పార్కులోకి మురుగు వచ్చి చేరుతోందని, దీంతో పార్కులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాలా ఆక్రమణకు గురైందని, మురుగు పొంగి పార్కులోకి వస్తోందన్నారు.
అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్‌లో నాలాను ఆక్రమించి ఇండ్లు నిర్మించడం వల్ల వరద సాఫీగా సాగడంలేదని, దీంతో వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆయా ప్రాంతాల వారు హైడ్రా ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీకి 150 ఫిర్యాదులు
జీహెచ్ ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 150 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 60 ఫిర్యాదులు రాగా, అడిషనల్ కమిషనర్లు మంగతాయారు, వేణుగోపాల్, పంకజ, గీత, రాధిక, సిసీపీ శ్రీనివాస్, అడిషనల్ సిసీపీ గంగాధర్ ప్రదీప్ స్వీకరించి పరిశీలించారు. ఆరు జోన్లలో 90 ఫిర్యాదులు వచ్చాయి.
కలెక్టరేట్ ప్రజావాణికి 161 ..
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 161 ఫిర్యాదులు వచ్చాయి. హౌసింగ్ కు 97 రా గా, ఇందిరమ్మ ఇండ్ల కోసం 86, డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 11, పెన్షన్లు 22, రెవెన్యూ 12, ఇతర శాఖలు 30 వచ్చాయని అడిషనల్కలెక్టర్ ముకుంద్ రెడ్డి తెలిపారు.సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం పాల్గొన్నారు.