
- ఎక్కువ ఆదరణ పొందిన మోడల్ ఐఫోన్ 16
- పడిపోయిన వన్‌ప్లస్, పోకో, షియోమి, రియల్‌మీ షిప్‌మెంట్లు
- ప్రీమియం ఫోన్లకు పెరుగుతున్న గిరాకీ
న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏకంగా 7 కోట్ల ఫోన్లను అమ్మింది. శామ్‌సంగ్, యాపిల్ వంటి కంపెనీలు భారీగా షిప్‌మెంట్లు (ఫోన్ల రవాణా) జరిపాయి. కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే 0.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో 3.7 కోట్ల స్మార్ట్‌ఫోన్లు మాన్యుఫాక్చరర్ల నుంచి రవాణా అయ్యాయి. ఇది ఏడాది లెక్కన 7.3 శాతం ఎక్కువ. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం, యాపిల్ ఎక్కువ ఫోన్లను షిప్ చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కంపెనీ షిప్‌మెంట్లు 21.5శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరాయి. ఐఫోన్ 16 మోడల్ దేశవ్యాప్తంగా అత్యధికంగా షిప్ అయిన మోడల్‌గా నిలిచింది. ఇది మొత్తం షిప్‌మెంట్లలో 4శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో యాపిల్ ఐఫోన్ సప్లయ్ ఏడాది లెక్కన 19.7శాతం పెరిగింది. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ వాటా 7.5శాతానికి చేరుకుంది. సుమారు 27 లక్షల ఐఫోన్లు రవాణా అయ్యాయని అంచనా.
మిగిలిన బ్రాండ్లలో..
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో వాటా 19 శాతం వద్ద కొనసాగుతోంది. వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఇండియాలో వివో ఫోన్ల షిప్‌మెంట్లు ఏడాది లెక్కన 23.5శాతం పెరిగాయి. శామ్‌సంగ్ 14.5శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కంపెనీ షిప్‌మెంట్లు 21శాతం పెరిగాయి. గెలాక్సీ ఏ/ఎం/ఎఫ్ సిరీస్‌లో ఏఐ ఫీచర్లతో కొత్త మోడల్స్‌ను శామ్‌సంగ్ తీసుకొచ్చింది. ఒప్పో షిప్‌మెంట్లు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 25.4శాతం పెరగగా, 13.4శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో ఉంది. మోటరోలా షిప్‌మెంట్లు 39.4శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ వాటా 8 శాతంగా రికార్డయ్యింది.
ఐకూ ఫోన్లకు జూన్ క్వార్టర్‌లో మంచి డిమాండ్ కనిపించింది. కంపెనీ ఫోన్ షిప్‌మెంట్లు కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 68.4 శాతం పెరిగాయి. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐకూ వాటా 4.3 శాతంగా ఉంది. మరోవైపు వన్‌ప్లస్ వాటా 4.4శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. ఈ కంపెనీ షిప్‌మెంట్లు 39.4 శాతం తగ్గాయి. రియల్‌మీ వాటా 9.7శాతానికి తగ్గగా, షిప్‌మెంట్లు 17.8 శాతం పడ్డాయి. షియోమి మార్కెట్ వాటా 9.6 శాతంగా నమోదైంది. కంపెనీ షిప్‌మెంట్లు 23.5శాతం తగ్గాయి. పోకో షిప్‌మెంట్లు 28.8శాతం పడ్డాయి. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ కంపెనీ వాటా 3.8 శాతంగా ఉంది.
స్మార్ట్‌ఫోన్ సగటు ధర పైకి..
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ సగటు ధర ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 10.8 శాతం పెరిగి 275 డాలర్ల (రూ.23,500) కి చేరింది. ఎంట్రీ-లెవల్ (రూ.8,700 కంటే తక్కువ) సెగ్మెంట్ షిప్‌మెంట్లు ఏడాది లెక్కన 22.9శాతం వృద్ధి చెందాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ కేటగిరీ వాటా 16 శాతంగా ఉంది. మాస్ బడ్జెట్ (రూ.8,700–- రూ.17,400) 1.1శాతం వృద్ధి చెందగా, ఎంట్రీ -ప్రీమియం (రూ.17,400–రూ.35 వేలు) షిప్‌మెంట్లు 2.5శాతం తగ్గాయి. మిడ్-రేంజ్ మార్కెట్‌లో కొత్త మోడల్స్ విడుదల వల్ల తీవ్ర పోటీ ఉంది. దీంతో పండుగ సీజన్‌లో ఇన్వెంటరీ పెరిగే సమస్య లేకపోలేదని ఐడీసీ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి హెచ్చరించారు. క్వాల్‌కామ్ చిప్‌సెట్ ఆధారిత ఫోన్లు జూన్ క్వార్టర్‌లో 37.6శాతం పెరిగాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో వీటి వాటా 33.9 శాతంగా ఉంది. మీడియాటెక్ ఆధారిత ఫోన్లు 15.4 శాతం తగ్గాయి. ఈ ఫోన్ల వాటా 44.3శాతానికి పడిపోయింది.
ఐఫోన్ 16, 15లకు డిమాండ్..
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్లకు గిరాకీ పెరుగుతోంది. ఫోన్ ధర రూ. 52 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉంటే ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఈ ఫోన్ల షిప్‌మెంట్లు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఏడాది లెక్కన 96.4 శాతం వృద్ధి చెందాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 4 శాతం వాటాకు చేరాయి. ఈ సెగ్మెంట్‌లో 60శాతానికి పైగా షిప్‌మెంట్లు ఐఫోన్ 16/15 కి చెందినవి ఉన్నాయి. సూపర్-ప్రీమియం (రూ.70 వేల పైన) షిప్‌మెంట్లలో 15.8శాతం వృద్ధి నమోదైంది. ఫోన్ మార్కెట్‌లో 7శాతం వాటాతో కొనసాగుతోంది. ఈ కేటగిరీలో శామ్‌సంగ్ వాటా 49 శాతం వాటాకు చేరుకోగా, యాపిల్ వాటా 48 శాతం వద్ద ఉంది. ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25/ఎస్24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్లస్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.