సైదాపూర్‌‌‌‌ మండలంలో సర్పంచ్‌‌‌‌ పదవులకు వేలం ?

 సైదాపూర్‌‌‌‌ మండలంలో సర్పంచ్‌‌‌‌ పదవులకు వేలం ?
  • కరీంనగర్‌‌‌‌ జిల్లా ఆరేపల్లిలో రూ. 8.50 లక్షలు..
  • గర్రేపల్లిలో రూ. 12 లక్షలకు దక్కించుకున్న క్యాండిడేట్లు
  • గర్రేపల్లిలో ఉపసర్పంచ్‌‌‌‌తో పాటు, వార్డు సభ్యులకూ వేలం

సైదాపూర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లా సైదాపూర్‌‌‌‌ మండలం ఆరేపల్లి, గర్రేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌‌‌‌ పదవులకు వేలం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. గర్రపల్లి గ్రామపంచాయతీలో 380 మంది ఓటర్లు ఉండగా.. సర్పంచ్‌‌‌‌ పదవి ఎస్సీకి రిజర్వ్‌‌‌‌ అయింది. సర్పంచ్‌‌‌‌ సీటు కోసం ముగ్గురు క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులంతా కలిసి ఆదివారం సర్పంచ్‌‌‌‌ పదవి కోసం వేలం నిర్వహించినట్లు తెలిసింది.

 బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మద్దతుతో పోటీ చేస్తున్న క్యాండిడేట్‌‌‌‌ రూ.8.50 లక్షలకు సర్పంచ్‌‌‌‌ పదవిని దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎనిమిది వార్డులకు మాత్రం ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే ఇదే మండలంలోని ఆరేపల్లి గ్రామంలో 636 ఓట్లు ఉండగా.. సర్పంచ్‌‌‌‌ పదవి జనరల్‌‌‌‌ మహిళకు రిజర్వ్‌‌‌‌ అయింది. ఈ గ్రామంలోనూ పెద్ద మనుషుల సమక్షంలో సర్పంచ్‌‌‌‌ పదవికి వేలం నిర్వహించినట్లు తెలిసింది.

 సర్పంచ్‌‌‌‌ పదవిని రూ. 12 లక్షలకు, ఉపసర్పంచ్‌‌‌‌ పదవిని రూ. 2 లక్షలకు దక్కించుకున్నారని పలువురు చెబుతున్నారు. అలాగే గ్రామంలో 8 వార్డులు ఉండగా.. ఒక్కో వార్డుకు రూ.20 వేల చొప్పున ఖరారు చేసి క్యాండిడేట్లను ఫైనల్‌‌‌‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వేలంలో పదవులు దక్కించుకున్న వారు తప్ప మిగతా వారంతా నామినేషన్లను విత్‌‌‌‌డ్రా చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.