ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు

ఇద్దరు సీఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

తాజాగా కామారెడ్డి టౌన్ సీఐ ఇంట్లో సోదాలు

వివాదాస్పదంగా కొందరు పోలీస్ ఆఫీసర్లు

పోలీస్ డిపార్ట్ మెంట్ లో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా కొంతమంది ఆఫీసర్ల తీరు మారడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలన్నర వ్యవధిలో ఇద్దరు సీఐలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా, తాజాగా కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్వర్ పై ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలోని ఆయన ఇంట్లో ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు.

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కొంతమంది పోలీస్ ఆఫీసర్లపై ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీకి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్, భూముల తగదాలు, సివిల్ వివాదాలు, ఇసుక అక్రమ రవాణా, కేసుల నమోదు, అరెస్టు వంటి వ్యవహారాల్లో కొందరు తలదూర్చి వివాదాస్పదంగా మారుతున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో పోస్టింగులు పొందుతున్న పలువురు ఆఫీసర్లు వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో అయితే కాసులతోనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్​ఐఆర్ నమోదు చేయటానికి బాధితులను పైసలు కూడా డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 40 రోజుల్లో ఇద్దరు సీఐలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. అక్టోబర్ 12న కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. అదే నెల 31న నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ సీఐ రాకేశ్ రూ.50వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్థల వివాదంలో రూ.50వేలతోపాటు సెల్​ఫోన్ కూడా తీసుకున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్వర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. కొందరు ఏసీబీ పైఆఫీసర్లకు చేసిన ఫిర్యాదు చేయగా నల్లగొండ రేంజ్ డీఎస్పీ ఆనంద్​కుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రం విద్యానగర్​కాలనీలోని సీఐ కిరాయి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ లో కూడా రికార్డులు పరిశీలించారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ల వ్యవహారంలో పెద్ద మొత్తంలో పైసలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో కామారెడ్డి డివిజన్ లో ఇద్దరు పోలీసు ఆఫీసర్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్​లైన్ బెట్టింగ్​లు చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకొని పైసలు వసూలు చేసినట్లు తెలిసింది.

కామారెడ్డి డివిజన్ లో పనిచేస్తున్న ఓ ఆఫీసర్ సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నట్లు సమా చారం. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వెళ్తే చాలు వాస్తవాలు ఏమిటో ఎంక్వైరీ చేయకుండానే ఇరువర్గాల వారిని కూర్చోబెట్టి రాజీ కుదుర్చుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

ఎల్లారెడ్డి డివిజన్ లోని గాంధారి పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజుల కింద గండిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తులు గొడవపడ్డారు. గ్రామంలో ఘర్షణ పడగా ఫిర్యాదు చేయటానికి వెళ్లిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మరోవర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. స్టేషన్ లోనే దాడి జరగటం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట జోరుగా సాగుతోంది. ఫిర్యాదులు వెళ్లినప్పటికీ పైసలు ఇచ్చిన స్థావరాలపై దాడులు చేయకుండా, కింది స్థాయి వ్యక్తులు, తక్కువ మొత్తంలో పైసలు దొరికే స్థావరాలపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.