జాన్ పహాడ్ దర్గా వద్ద వసతులు కరువు

జాన్ పహాడ్ దర్గా వద్ద వసతులు కరువు
  • దర్గాలో అనధికార వ్యక్తుల పెత్తనం
  • ఎక్కడ కనిపించని ధరల బోర్డులు  
  • ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు

సూర్యాపేట/ పాలకవీడు, వెలుగు:  జాన్ పహాడ్ దర్గాలో అనధికార వ్యక్తులు పెత్తనం చెలాయిస్తూ భక్తుల నుంచి భారీగా అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని ఈ దర్గాకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని బయట వ్యక్తులు అనధికారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కులు చెల్లించుకోవాలంటే జేబులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.

17 వస్తువుల విక్రయానికి కాంట్రాక్టులు 

గతంలో జాన్ పహాడ్ దర్గా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండేది. వక్ఫ్ బోర్డు టెండర్ ప్రక్రియ ద్వారా ఏడాదికి 17 రకాల వస్తువుల విక్రయానికి కాంట్రాక్టులు మంజూరు చేసేది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో, కేసు విచారణలో ఉన్న కారణంగా టెండర్లపై కోర్టు స్టే విధించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న కొందరు వ్యక్తులు వక్ఫ్ బోర్డు అధికారులతో చేతులు కలిపి, వారానికి రూ.2 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని దర్గాపై అనధికార పెత్తనం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ధరలు తెలిపే బోర్డులు లేక.. 

దర్గా వద్ద కందూరులో భాగంగా పొట్టేలు, కోళ్లను కోసి సైదులు బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో ఒక్క పొట్టేలు కోసినందుకు రూ.500 నుంచి రూ.800 వరకు, పాతేహాల సమయంలో ఒక్కొక్క యాటకు రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. కోడి మొక్కు చెల్లించాలన్నా రూ.1000 తప్పనిసరిగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్లకు పూజ చేయాలంటే రూ.500, లారీలకు రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నా, ఈ ధరల వివరాలను తెలిపే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్గా పరిసరాలు అపరిశుభ్రం

దర్గా పరిసరాలు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారాయని, తాగునీటి కుళాయిల వద్ద కూడా పరిశుభ్రత లోపించిందని భక్తులు అంటున్నారు. స్నానాలు చేసి బట్టలు మార్చుకునేందుకు సరిపడా గదులు లేకపోవడం, కొన్ని గదులు అసంపూర్తిగా నిలిచిపోవడం సమస్యగా మారింది. వంట చేసుకుని భోజనం చేసే వసతి గృహాలు కూడా తక్కువగా ఉండటంతో, భక్తులు ప్రైవేటు వసతి గృహాలకు అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.

జనవరి 22 నుంచి మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు

జనవరి 22 నుంచి మూడు రోజుల పాటు జాన్ పహాడ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించేందుకు వక్ఫ్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, ప్రభుత్వం స్పందించి సరైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు అనధికార వసూళ్లను అరికట్టి దర్గా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

అక్రమ వసూళ్లపై తమ దృష్టికి సమాచారం రాలేదని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాన్ పహాడ్ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ మహబూబ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దర్గాలో టెండర్లు వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారమే ఇచ్చామని ఆయన తెలిపారు.