టెండర్​ లేకుండానే అడ్వాన్స్‌‌‌‌ గా పనులు.. కరీంనగర్ బల్దియాలో ఆఫీసర్ల ఇష్టారాజ్యం

టెండర్​ లేకుండానే అడ్వాన్స్‌‌‌‌ గా పనులు.. కరీంనగర్ బల్దియాలో ఆఫీసర్ల ఇష్టారాజ్యం
  • కిసాన్ నగర్ లో రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా రూ.1.12 కోట్ల పనులు
  • ఇవే పనుల బిడ్డింగ్‌‌‌‌కు ఈ నెల 31 వరకు గడువు
  • కాంట్రాక్టర్ ఎవరో తేలకుండానే పనులు నడుస్తుండడంపై విమర్శలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ మున్సిపల్​ కార్పొరేషన్‌‌‌‌లో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టెండర్​ పూర్తికాకుండానే, కాంట్రాక్టర్ ఎవరో తేలకుండానే సుమారు రూ.కోటి విలువైన సీవరేజ్ డ్రెయిన్ పైప్ లైన్ పనులు, సీసీ రోడ్ల ప్యాచ్  పనులు చకచకా పూర్తిచేయించారు. మరోవైపు ఈ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు బిడ్స్​ వేసేందుకు ఈ నెల 31వరకు గడువుంది. నోటిఫికేషన్​గడువు రాకముందే రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పనులు చేయించడం, ఇంజనీరింగ్ ఆఫీసర్లు సహకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మూడు పనులకు రూ.1.12కోట్లు  

కరీంనగర్ సిటీలోని 25వ డివిజన్ కిసాన్ నగర్‌‌‌‌‌‌‌‌లోని బూరుగుపల్లి సత్యనారాయణ ఇంటి నుంచి బోయిని జగన్ ఇంటి వరకు రూ.33 లక్షలతో, కల్లెపల్లి కుమార్ ఇంటి నుంచి మహమ్మద్ జమాలుద్దీన్ ఇంటి మీదుగా బొమ్మాడి తిరుపతి ఇంటి వరకు రూ.27 లక్షలతో సీవరేజ్ డ్రెయిన్ పైపు లైన్, సీసీ ప్యాచ్ వర్క్స్, అలాగే  అరుంధతి నగర్ లో రూ.52 లక్షలతో ఎల్లమ్మ టెంపుల్ వరకు, మరో మార్గంలో హనుమాన్ టెంపుల్ వరకు సీవరేజ్ డ్రెయిన్ పైపు లైన్, సీసీ ప్యాచ్ వర్క్స్, ఇంటర్నల్ లైన్స్ చేపట్టాల్సి ఉంది. ఈ మూడు చోట్ల పనులకు ఇటీవల ఆఫీసర్లు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 

బిడ్స్​వేసేందుకు ఈ నెల 31 వరకు కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చారు. బిడ్​దక్కించుకున్న కాంట్రాక్టర్లు సెప్టెంబర్ లో మున్సిపల్ కార్పొరేషన్ తో అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇవేవీ జరగకుండానే కిసాన్ నగర్ లో పనులు కొనసాగుతున్నాయి. ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అరుంధతి నగర్ లో కూడా రూ.50లక్షల విలువైన పనులు 80 శాతం పూర్తయ్యాయి.  టెండర్ లో పేర్కొన్న ఏరియాల్లో సీసీ రోడ్లు అన్నీ కొత్తగానే ఉండి ప్యాచ్ వర్క్స్ అవసరం లేకున్నా  ఈ పనుల కోసం నిధులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పనులు ఆపించామని బల్దియా ఇంజనీరింగ్ ఆఫీసర్లు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.

పనులు ఆపించాం.. 

కిసాన్ నగర్ లో కుమారస్వామి అనే కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేస్తే ఆపేశాం. మేం గృహలక్ష్మి స్కీమ్  వెరిఫికేషన్ లో ఉండగా వాళ్లు పని మొదలుపెట్టి ఉండొచ్చు. మళ్లీ వర్క్ ఇన్ స్పెక్టర్ ను పంపించి 
చెక్ చేయిస్తాం. 

- మహ్మద్ ఆయూబ్ ఖాన్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎంసీకే