
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) సంస్థ జర్మనీకి చెందిన అలియాంజ్‌తో కలిసి భారతదేశంలో రీఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి 'అలియాంజ్ జియో రీఇన్సూరెన్స్ లిమిటెడ్' (ఏజేఆర్ఎల్) అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం (సెప్టెంబర్ 09) ప్రకటించింది.
ఈ భాగస్వామ్యంలో, జేఎఫ్ఎస్ఎల్ సంస్థ రూ. 2.50 లక్షల పెట్టుబడితో ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ గల 25 వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి ఏజేఆర్ఎల్లో 50 శాతం వాటాను దక్కించుకుంటుందని జేఎఫ్ఎస్ఎల్ తెలిపింది. రీఇన్సూరెన్స్ వ్యాపారం అంటే ఒక బీమా కంపెనీ తన రిస్క్‌ను మరొక బీమా కంపెనీకి బదిలీ చేయడం.
దీనిని "బీమాకు బీమా" అని కూడా అంటారు. సాధారణంగా, ఒక బీమా కంపెనీ తన పాలసీదారులకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి రీఇన్సూరెన్స్ తీసుకుంటుంది.