- జీవో 229కి వ్యతిరేకంగా టాడా-జాక్ ఏర్పాటు
- వెనక్కి తగ్గకుంటే సేవలు బంద్ చేస్తామని సర్కారుకు హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ)లో ప్రభుత్వం వేలు పెడితే సహించేది లేదని అల్లోపతిక్ డాక్టర్లు తేల్చిచెప్పారు. కోఠిలోని ఐఎంఏ హాల్ లో శనివారం భేటీ అయిన ఐఎంఏ, హెచ్‌ఆర్‌డీఏ, జూడాతో సహా ప్రధాన వైద్య సంఘాలన్నీ ఏకమయ్యాయి. ప్రభుత్వ జీవో 229కి వ్యతిరేకంగా తెలంగాణ అల్లోపతిక్ డాక్టర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (టీఏడీఏజేఏసీ)ని ఏర్పాటు చేశాయి.
కౌన్సిల్ లో నలుగురు ఎక్స్ -ఆఫీషియో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో.. కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్య స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలి దశలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, సీఎం, పీఎంవోలకు వినతిపత్రాలు పంపిస్తామన్నారు. అప్పటికీ సర్కార్ దిగిరాకపోతే హాస్పిటల్స్ లో సేవలు బంద్ చేసి, హైకోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
