జనం లేకుండానే జగన్నాథ రథయాత్ర.. అనుమతించాలని సుప్రీంకు కేంద్రం వినతి

జనం లేకుండానే జగన్నాథ రథయాత్ర.. అనుమతించాలని సుప్రీంకు కేంద్రం వినతి

న్యూఢిల్లీ: ఒడిషాలోని ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రపై నమోదైన పలు పిటిషన్ల మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ముందు కేంద్రం తన వాదనలు వినిపించింది. ఏటా నిర్వహించే జగన్నాథ రథయాత్రను కరోనా దృష్ట్యా ఈసారి ప్రజలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని సుప్రీంను కేంద్రం కోరింది. కేంద్ర వాదనకు ఒడిశా సర్కార్ కూడా మద్దతు తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జగన్నాథ రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని గత గురువారం సుప్రీం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి రథయాత్ర తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్నా.. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలతో దీనిపై సందిగ్ధత నెలకొంది. ‘ఇది కోట్లాది మంది విశ్వాసానికి సంబంధించింది. ఒకవేళ జగన్నాథ స్వామి ఇప్పుడు బయటకు రాకపోతే ఆచారం ప్రకారం మరో 12 ఏళ్ల వరకు రావడం కుదరదు’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ విషయంపై లోతైన విచారణ జరిపేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.