
హైదరాబాద్, వెలుగు: చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయన్న కారణంతో షుగర్ ఫ్యాక్టరీల్లోని నిల్వల అమ్మకాలపై ఆంక్షలు పెడితే రైతులకు కంపెనీలు బకాయిలు ఎలా చెల్లిస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బకాయిల చెల్లింపుకు అవసరమైన మేరకైనా కంపెనీలకు చక్కెర అమ్ముకునే వీలు కల్పించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖను జస్టిస్ రాజశేఖర్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్కు చెందిన ట్రైడెంట్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆయన విచారించారు. ‘‘పిటిషనర్ దగ్గర రెండు లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. నెలకు రెండు శాతమే అమ్ముకునేలా కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో ఏడాదిలో సగం కూడా అమ్మలేం. కేంద్రం నిబంధన వల్ల రైతులకు డబ్బు చెల్లిపులూ ఆగిపోతున్నాయి” అని పిటిషనర్ వాదించారు. ఉత్పత్తి పెరిగి ధర పడిపోతున్నందుకే కేంద్రం ఈ నిబంధన పెట్టిందని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కే లక్ష్మణ్ వివరించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర హైకోర్టుల్లో నమోదైన ఏడు కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్రం కోరనుందని చెప్పారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.