PEDDI: ‘పెద్ది’ అదిరిపోయింది అంటూ బన్నీ ట్వీట్.. 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

PEDDI: ‘పెద్ది’ అదిరిపోయింది అంటూ బన్నీ ట్వీట్.. 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’  బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'పెద్ది'.. మొదటి రోజే రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

లేటెస్ట్గా పెద్ది 5 రోజుల వసూళ్లను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పెద్ది ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని తెలిపారు. పెద్ది 5వ రోజు (సోమవారం) ఇండియాలో ఏకంగా రూ.12.05 కోట్ల నెట్, రూ.22 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. వర్కింగ్ డే రోజున పెద్ది దేశవ్యాప్తంగా 28 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం.

‘పెద్ది’పై అల్లు అర్జున్ ప్రశంసలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తనదైన రివ్యూ షేర్ చేశాడు. ‘పెద్ది’ లో రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని, ఆయనను చూసి గర్విస్తున్నానంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

‘‘నిన్న రాత్రి జూన్ 8న పెద్ది సినిమా చూశాను. పెద్ది పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కఠినమైన శ్రమ, సహజమైన నటన, అసాధారణమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేశాడు. చరణ్‌పై నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలకు అతను పూర్తిగా అర్హుడు’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అలాగే జగపతి బాబు నటనను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన, మిగతా నటీనటుల ప్రదర్శన కూడా అద్భుతంగా ఉందన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు అభినందనలు తెలిపిన బన్నీ, చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు మరియు నిర్మాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు బుచ్చిబాబు సానాను ప్రత్యేకంగా అభినందించిన అల్లు అర్జున్.. "ప్రతి నటుడి నుంచి అత్యుత్తమ ప్రతిభను రాబట్టడమే కాకుండా, రామ్ చరణ్‌ను మరింత ఉన్నత స్థాయిలో ఆవిష్కరించారు. ‘పెద్ది’ చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇకపోతే, ‘పెద్ది’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 53 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు.