హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ శబ్దంతో డీజే మ్యూజిక్ వినిపించడంపై ఫిర్యాదు చేసిన హీరో అల్లు శిరీష్.. తనపై వచ్చిన విమర్శలకు స్పందించారు. తాను కూడా హనుమంతుడి భక్తుడినేనని చెబుతూ, భక్తి కార్యక్రమాలను తాను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దంతో డీజే పెట్టడంపైనే తన అభ్యంతరమని, తాను ప్రశ్నించింది భక్తిని కాదు.. సివిక్ సెన్స్‌ను అని శిరీష్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే:
షేక్‌పేటలోని అపర్ణ వన్ సొసైటీలో నివసిస్తున్న అల్లు శిరీష్.. వినోభానగర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2-3 గంటల వరకు పెద్ద శబ్దంతో పాటలు వినిపిస్తున్నాయని హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ శబ్దాల కారణంగా సొసైటీలోని పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆలయంలో భక్తి కార్యక్రమాలను శిరీష్ వ్యతిరేకిస్తున్నారంటూ కొందరు విమర్శలు చేయడంతో ఆయన స్పందించారు.
‘ఫ్రెండ్స్.. నేను కూడా హనుమంతుడి భక్తుడినే. కానీ తెల్లవారుజామున 2 గంటలకు డీజే సెటప్‌తో పెద్దగా పాటలు పెట్టడం భక్తి కాదు. నేను ఫిర్యాదు చేసింది సివిక్ సెన్స్ గురించి మాత్రమే.. భక్తి గురించి కాదు’ అంటూ శిరీష్ క్లారిటీ ఇచ్చారు.
Friends.. I am religious myself and pray to Lord Hanuman. Blasting music with DJ setup at 2am is not Bhakti. What I complained is abt civic sense not devotion. Thank you for understanding.. pic.twitter.com/frOgcSl09m
— Allu Sirish (@AlluSirish) September 28, 2026
అది హనుమాన్ ఆలయం కాదు.. పోలీసుల వివరణ
మరోవైపు అల్లు శిరీష్ ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు స్పందించినట్లు సమాచారం. శిరీష్‌తో పోలీసులు మాట్లాడినట్లు, ఆయన ప్రస్తావించిన కార్యక్రమం హనుమాన్ ఆలయానికి సంబంధించినది కాదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అది గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమమని, నిమజ్జనం కూడా పూర్తయిందని నిర్వాహకులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. శిరీష్ సోషల్ మీడియా ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించి, విషయాన్ని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ SHOకి తదుపరి చర్యల కోసం పంపినట్లు తెలిపారు.
