నాలుగు జిల్లాల్లో పేపర్​లెస్ కోర్టులు : సీజే అలోక్​  

నాలుగు జిల్లాల్లో పేపర్​లెస్ కోర్టులు : సీజే అలోక్​  
  • నేటి నుంచి సేవలు ప్రారంభం
  • హైకోర్టులో ఘనంగా రిపబ్లిక్ డే 

హైదరాబాద్, వెలుగు  :  వరంగల్, కరీంనగర్, జగిత్యాల, హనుమకొండ జిల్లా కోర్టులు శనివారం నుం చి పేపర్​లెస్ కోర్టులుగా మారుతున్నాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. 4 జిల్లాల్లో ఈ – ఫైలింగ్ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా హైకోర్టు ఆవరణలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘హైకోర్టులో ట్యాక్స్‌‌ కేసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కేసులు ఈ–ఫైలింగ్‌‌ చేసే వీలుంది.

కేసుల విచారణ హైబ్రిడ్ (ఫిజికల్, ఆన్​లైన్) విధానంలో కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 37 ఈ–సేవా కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. పేపర్​లెస్‌‌ కోర్టులతో టైమ్ సేవ్ అవుతుంది. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు ఎంతో కీలకం. అందుకే.. హైకోర్టుకు ప్రభుత్వం రాజేంద్రనగర్‌‌ మండలంలో వంద ఎకరాలు కేటాయించింది’’అని అలోక్ అరాధే అన్నారు.

రాజ్యాంగం అనేది సామాజిక అగ్రిమెంట్

హైకోర్టును న్యాయ నిర్మాణ్‌‌ డాక్యుమెంట్‌‌ ప్రకారం నిర్మిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్‌‌ సభ్యులు ఎంతో అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యాంగ రక్షణలో లాయర్ల పాత్ర కీలకమన్నారు. రాజ్యాంగం చట్టబద్ధమైన డాక్యుమెంట్‌‌ కాదని, అదొక సామాజిక అగ్రిమెంట్‌‌ అని తెలిపారు. 2023, జులై 24 నుంచి ఈనెల 25వ తేదీ వరకు వంద శాతం కేసుల్ని (7,877 కేసులను) పరిష్కరించామని చెప్పారు.

జడ్జీల పోస్టుల భర్తీలో వెనుకబడినవర్గాల వారికి తీరని అన్యాయం జరుగుతున్నదని హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ పి.నాగేశ్వర రావు అన్నారు. బార్‌‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ నరసింహా రెడ్డి, అడ్వకేట్ జనరల్‌‌ సుదర్మన్‌‌ రెడ్డి, అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌ జి.ప్రవీణ్‌‌ కుమార్, పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ రాజేందర్‌‌ రెడ్డి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోపర్దన్‌‌ రెడ్డి పాల్గొన్నారు.