వరదలతో ప్రత్యామ్నాయ పంటలు కష్టమే

వరదలతో ప్రత్యామ్నాయ పంటలు కష్టమే
  • పత్తి, కంది అదును దాటింది
  • నిరుటితో పోలిస్తే 18 లక్షల ఎకరాలు తగ్గిన సాగు
  • నీటమునిగిన 15 లక్షల ఎకరాలు

హైదరాబాద్‌‌, వెలుగు : ఈ నెల ప్రారంభం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో పంటలను భారీగా దెబ్బతీశాయి. ఉన్న పంటలను కాపాడుకోలేక కొత్తగా పంటలు వేయలేక రైతులు అవస్థలు పడుతున్నరు. ఇప్పటికే పునాస (జూన్​లో వేసే పంటలు) పంటలు వేసే టైమ్‌‌ దాటిపోయింది. ఏం వేయాలన్నా ఈ సీజన్‌‌లో వరి తప్ప వేరే పంటలు వేసే పరిస్థితి లేదు. పత్తి, కంది వేసేందుకు అదును దాటిపోయింది. ఈ సీజన్‌‌లో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని టార్గెట్‌‌ పెట్టుకోగా 50 శాతం మాత్రమే సాగయ్యాయి. గత 27 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను మళ్లీ వేసుకోలేని  పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేక రైతులు వరిసాగు వైపు మొగ్గుతున్నారు.  

ప్రత్యామ్నాయం పక్కకే! 

రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని సర్కారు నిరుటి నుంచి చెబుతూ వస్తోంది. జిల్లాలవారీగా సమావేశాలు పెట్టి వరి తగ్గించాలని, పత్తి, కంది పంటలు ఎక్కువగా వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ప్రస్తుతం వర్షాలు, వరదల కారణంగా ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో  రైతులు ప్రత్యామ్నాయ పంటలను పక్కన పెట్టేశారు. ఇప్పటికే వేసిన పంటల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోయా, కంది, పెసర పంటలు 60 శాతంపైగా  దెబ్బతినగా, 12 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటపై ఎఫెక్ట్ పడింది.  పంట చేలన్నీ బురదమయం అయ్యాయి.  దీంతో బురదలో పత్తి, కంది పంటలను మళ్లీ విత్తనాలు వేసి సాగు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే అదును కూడా దాటిపోయింది. వర్షాలు తగ్గి, పంట చేల నుంచి నీరు తొలగిపోయిన తర్వాత ఏం పంటలు వేసుకోవాలనే దానిపై  వ్యవసాయశాఖ స్పష్టత  ఇవ్వకపోగా కనీసం విత్తనాలు అందుబాటులోకి తేలేదని రైతులు భగ్గుమంటున్నారు.

వరినాట్లకు అనుకూలంగా ఉంది

రాష్ట్రంలో ఇప్పుడు వేరే పంటల సాగు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. వానల వల్ల వరి నాట్లు వేసుకోవడానికే అనుకూలంగా ఉందని రైతులు అంటున్నరు.  దీంతో వరిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వరి నార్లు పోసుకున్న  రైతులు నాట్లు వేయడంలో వేగం పెంచేశారు. ఇప్పటికే 11.11లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. నార్లు పోయడానికి ఆలస్యమయ్యే  ప్రాంతాల్లో  నేరుగా వడ్లు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేపడుతున్నారు.  

సాగు టార్గెట్ కష్టమే!

రాష్ట్రంలో కురుస్తున్న వానలకు ఏర్పడిన నష్టంతో ఈసారి వ్యవసాయ శాఖ పెట్టుకున్న సాగు టార్గెట్ కూడా రీచ్ అయ్యే పరిస్థితులు కనబడడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కోటి 43 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో పత్తి పంటను 75 లక్షల ఎకరాల్లో, వరి 45 లక్షలు, మొక్కజొన్న 5 లక్షలు, సోయాబీన్​ను 3.50 లక్షల ఎకరాల్లో సాగుచేయించాలని టార్గెట్​పెట్టకున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 71.78 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 44.53 లక్షల ఎకరాల్లో సాగుకాగా, అందులో 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. కంది 4.69 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌‌‌‌‌‌‌‌ 3.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్నను 3.75 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే వ్యవసాయ శాఖ టార్గెట్, ప్రస్తుతం సాగైన పంటలను పరిశీలిస్తే టార్గెట్ రీచ్ కావడం కష్టంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఈయేడు 72 లక్షల ఎకరాలే నిరుడితో పోలిస్తే పంటల సాగు బాగా తగ్గింది. నిరుడు ఈ టైమ్‌‌‌‌‌‌‌‌కు 90 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా ఈయేడు 72 లక్షల ఎకరాలకే పరిమితమైంది. భారీ వర్షాలతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. పత్తి సాగుపై ఆశలు పెట్టుకోగా వానలు దెబ్బకొట్టాయి. పత్తి సాగు కూడా సగానికి పడిపోయే పరిస్థితి ఏర్పడింది.