చేపల ఉత్పత్తి రెండింతలైనా రేట్లు మాత్రం తగ్గట్లే

చేపల ఉత్పత్తి రెండింతలైనా రేట్లు మాత్రం తగ్గట్లే
  • మూడేండ్లలో రెండింతలైన దిగుబడి
  • మత్స్యకార సొసైటీలు కాంట్రాక్టర్ల చేతుల్లో
  • వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు
  • మార్కెట్లలో దళారుల దందా
  • నష్టపోతున్న మత్స్యకారులు

కరీంనగర్​, వెలుగు: రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలైనా రేట్లు మాత్రం తగ్గట్లేదు. మత్స్యకారుల సొసైటీలు కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉండడం, మార్కెట్లను దళారులే శాసిస్తుండడం, ఇక్కడ ఉత్పత్తయిన చేపలను డిమాండ్​ ఉన్న రాష్ట్రాలకు అమ్మేసుకుంటుండడంతో మన దగ్గర ఎక్కువ రేట్లకు చేపలను కొనాల్సి వస్తోంది. మూడేండ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తుండడంతో రిజర్వాయర్లు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఎల్​ఎండీ, మిడ్​మానేరు, శ్రీరాంసాగర్​, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీశైలం బ్యాక్​ వాటర్​, నాగార్జునసాగర్​, కాళేశ్వరంలోని మూడు రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి బాగా జరుగుతోంది.
వీటితోపాటు రాష్ట్రమంతటా 40 వేలకు పైగా చెరువుల్లో ప్రభుత్వం వేసే సీడ్​కు తోడు మత్స్యకార సొసైటీలు ప్రైవేటుగా చేప పిల్లలను తెచ్చి పెంచుతున్నాయి. దీంతో 2016–17లో 1.99 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. 2020–2021లో 3.49 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది 4 లక్షల టన్నులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఉత్పత్తి అంతలా పెరిగినా.. ధరలు మాత్రం దిగి రాకపోవడంతో జనం నష్టపోతున్నారు. పైగా జనం ఎక్కువగా తినే రవ్వ, బొచ్చె, బొమ్మె (కొర్రమేను) లాంటి రేట్లు పెరగడంతో ప్రజలు నిరాశ పడుతున్నారు.  
పట్టిన చేపలు పట్టినట్టే ఎగుమతి
రాష్ట్రంలోని మత్స్యకార సొసైటీల్లో చాలా వరకు కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం సప్లై చేస్తున్న చేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో అవి బతకట్లేదు. దీంతో సొసైటీలు కాంట్రాక్టర్లతో ముందే ఒప్పందం చేసుకుని ఏపీ నుంచి చేప పిల్లలను తెచ్చి పెంచుతున్నాయి. సీడ్​ వేసినప్పట్నుంచి అవి పెరిగాక పట్టి మార్కెటింగ్​ చేసే దాకా అన్ని పనులనూ కాంట్రాక్టర్లే చూసుకుంటున్నారు. ఏప్రిల్​ నుంచి జూన్​​ చివరి వరకు చెరువుల్లోని చేపలన్నింటిని పట్టేస్తున్నారు. వాటిని ముంబై, పుణె, నాగ్​పూర్, ​కోల్​కతా తదితర సిటీల్లోని హోల్​సేల్​​వ్యాపారులతో డీల్​ ​మాట్లాడుకొని లారీల్లో ఎగుమతి చేస్తున్నారు.

చేపలు పట్టే టైమ్​లో కిలోకు రూ.60 నుంచి రూ.70 సొసైటీలకు చెల్లిస్తూ, వాళ్లు హోల్​సేల్ ​​వ్యాపారుల వద్ద రూ.100 నుంచి రూ.120 దాకా తీసుకుంటున్నారు. హైదరాబాద్​లోని వ్యాపారులకూ ఇదే రేటుకు అమ్ముతుండటంతో వాళ్లు రిటైల్​గా రూ.150 నుంచి రూ.200కు అమ్ముతున్నారు. కరీంనగర్​, వరంగల్​​లాంటి జిల్లాల్లో పట్టే చేపలను సైతం స్థానికంగా నిల్వ చేసే అవకాశాలు లేక రాష్ట్రం దాటిస్తుండడంతో లోకల్​గా చేపలకు కొరత ఏర్పడుతోంది.  
మత్స్యకారులకు కూలీ కూడా దక్కట్లే 
మత్స్యకార సొసైటీలకు ప్రభుత్వం చేపపిల్లల్ని మాత్రమే ఫ్రీగా ఇస్తోంది. అయితే, వాటిని పెంచే చెరువుల నిర్వహణకు ఎలాంటి మద్దతు అందించడంలేదు. చేపలను పట్టడానికి బోట్లు, వలలు ఇవ్వకపోవడంతో ఇబ్బందవుతోందని సొసైటీ వాళ్లు ఆవేదన చెందుతున్నారు. చేపల ట్రాన్స్​పోర్ట్​,​ మార్కెటింగ్​కు సంబంధించిన సహకారం అందట్లేదని వాపోతున్నారు. ఎక్కడైనా అన్ని ఇబ్బందులను ఎదుర్కొని సొసైటీలే చేపలు పెంచినా కోల్డ్​​స్టోరేజీలు లేక వాటిని నిల్వ చేయడం, అమ్ముకోవడం కష్టమవుతోంది. దీంతో చాలా వరకు కాంట్రాక్టర్లకే అప్పగించేస్తున్నారు. దీంతో మార్కెటింగ్​ చేసుకుంటున్న వ్యాపారులు రెట్టింపు లాభాలు పొందుతున్నారు. రిజర్వాయర్లలో చేపలు పడుతున్న వాళ్ల బాధ మరోలా ఉంది. ఐదేండ్లలో బోట్లు, తెప్పలు, వలల రేట్లు విపరీతంగా పెరిగాయి. ప్రాణాలకు తెగించి చేపలను పట్టి మార్కెట్​కు తీసుకెళ్తే మారుబేరగాళ్లు అడ్డకి పావుశేరు అడుగుతున్నారు. మార్కెట్లన్నీ ఈ మారుబేరగాళ్ల చేతుల్లో ఉండటంతో ఎక్కడ కూడా మత్స్యకారులు చేపలను స్వయంగా అమ్ముకునే పరిస్థితి లేదు. 
సలహాలిచ్చేటోళ్లు లేరు
చేపల పెంపకానికి సంబంధించి ఫీల్డ్​​లెవెల్​లో  మత్స్యకారులకు సలహాలు ఇచ్చేందుకు మత్స్యశాఖలో ఫిషరీస్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్ల (ఎఫ్​డీవో) పోస్టులు 49 ఉండగా 30 మంది మాత్రమే పని చేస్తున్నారు. కొన్ని చోట్ల జిల్లా ఆఫీసర్ల  పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎఫ్ డీవోలే ఇన్​చార్జులుగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. నియోజకవర్గానికి ఒక ఎఫ్​డీవో ను నియమించాలన్న డిమాండ్​​ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదు. చేపలకు ఏవైనా రోగాలొస్తే చూసేందుకు జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్​ సెంటర్లు కూడా లేవు. ఎవరికివారే తోచిన మందులు వాడడంవల్ల కూడా చేపలు చనిపోయి నష్టపోతున్నారు.    
ఏం చేయాలె? 
మత్స్యకారులు లబ్ధి పొందాలన్నా.. జనానికి అగ్గువకే చేపలు దొరకాలన్నా ప్రభుత్వం సొసైటీలను పటిష్టం చేయాల్సిన​అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. చేపపిల్లలను అందించడంతోపాటు సబ్సిడీపై వలలు, బోట్లు అందజేయాలి. దళారీ వ్యవస్థను కంట్రోల్​​చేసి, మత్స్యకారులే చేపలను అమ్ముకునేలా ప్రత్యేక వాహనాలు అందించాలి. చేపలు పట్టడం, వాటిని సరైన పద్ధతిలో ప్రాసెస్​చేయడంపై యూత్​కు ట్రైనింగ్ ఇవ్వాలి. డిమాండును బట్టి అమ్ముకునేందుకు వీలుగా జిల్లాకేంద్రాల్లో కోల్డ్​స్టోరేజీలను నిర్మించాలి. చేపలు చెడిపోకుండా ఐస్​ అవసరం కాబట్టి.. మండల కేంద్రాల్లో ఐస్​ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలి. 
మాకు ఇచ్చేది రూ.60 మాత్రమే
సొసైటీలకు ప్రభుత్వం చేప పిల్లలు ఇస్తుంది. సర్కారు ఇచ్చే పిల్లలు చాలక బయట కొని పోసుకుంటున్నం. సొసైటీల్లో చాలా మందికి చేపలు పట్టడం రాదు. ట్రైనింగ్ కావాలి. ట్రాన్స్​పోర్టు వెహికల్స్​ కావాలి. ఇవన్నీ పెట్టుకుని మార్కెట్​కు పోతే రేటు వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కాంట్రాక్టర్లకు ఇస్తున్నం. చెరువు దగ్గర్నే కాంటా పెట్టి.. కిలోకు రూ.60 నుంచి రూ.70 ఇస్తరు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-గొడుగు సమ్మయ్య, చెల్పూర్ సొసైటీ అధ్యక్షుడు, హుజూరాబాద్
కోల్డ్​ స్టోరేజీలు పెట్టాలె 
చేపలు పట్టిన తర్వాత 2,3 రోజులు నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్​ స్టోరేజీలను ఏర్పాటు చేయాలె. ఇందుకు ఐస్ కావాలి. కరీంనగర్​లో ఐస్ ఫ్యాక్టరీ పాడైంది. మంచిర్యాల నుంచి ఐస్ తెప్పిస్తే వాళ్లు ట్రేకు రూ.5 ఎక్కువ తీసుకున్నరు. జమ్మికుంటలో ఫ్యాక్టరీ ఉంటే మేలైంది.  - రాజశేఖర్, చెల్పూర్, హుజూరాబాద్