40 వేల ఎకరాలకు ఆగిన సాగునీటి సరఫరా

40 వేల ఎకరాలకు ఆగిన సాగునీటి సరఫరా

సంగారెడ్డి/పుల్కల్, వెలుగు : 
జిల్లాలోని  పుల్కల్​ మండల పరిధిలో 29.917 టీఎంసీల కెపాసిటీతో ఉన్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 28.323 టీఎంసీల నీళ్లతో కళకళలాడుతోంది.  అయితే ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందా.. ఎప్పుడెప్పుడు సాగునీళ్లు ఇస్తారా.. అని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతోంది. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా.. లేకున్నా నాలుగేళ్లుగా రైతులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. మరో మూడేళ్ల దాకా సాగునీటి కష్టాలు ఉండవని భావించిన రైతులకు చెరువులు నిండాయన్న పేరుతో సింగూరు నీటి విడుదలపై నీటి పారుదల శాఖ కాలయాపన చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడట్ల..ఇప్పుడిట్ల..!
సింగూరు పరివాహక వ్యవసాయ భూములు మొత్తం వరి పంటలకు అనుకూలంగా ఉన్నాయి. సింగూరును నమ్ముకుని రైతులు గత యాసంగిలో 40 వేల పైచిలుకు ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేస్తేనే సింగూరు నీళ్లు కెనాల్స్ ద్వారా విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఏదేమైనా నీళ్లు మాత్రం ఇయ్యలేదు. రైతులు వెనక్కి తగ్గి వరి పంటలు వేయకుండా ఇతర పంటలు సాగు చేశారు. అలా గతేడాది వానాకాలం సీజన్ గడిచిపోయింది. ఈసారి వానాకాలంలో మళ్లీ సింగూరు నీటి విడుదల సమస్య తలెత్తుతోంది. నిండిన చెరువులను సాకుగా చూపించి సింగూర్ నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తలేరు. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. గత నాలుగేళ్లుగా ఇదే సమస్య రిపీట్ అవుతోంది. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధుల దృష్టికి రైతులు పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకునేవారు 
కరువయ్యారు. 

ప్రాజెక్టు పక్కనే ఉన్నా ఫలితం శూన్యం.. 
మెదక్ జిల్లాలోని ఘణపురం ప్రాజెక్టుకు గత నెలలో సింగూరు నుంచి వానాకాలం పంటలకు నీటిని వదిలారు. ఘనపురం ఆయకట్టుకు రెండు పంటలకు కలిపి ఏటా 4 టీఎంసీల నీటిని దశలవారీగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్ కు ఇప్పటికే మూడు టీఎంసీల నీటిని విడుదల చేశారు. అయితే సంగారెడ్డి జిల్లాలో సింగూరుకు పక్కనే ఉన్నా ఆయకట్టుకు మాత్రం అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో సంబంధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. పైగా సంగారెడ్డి జిల్లాలో రిపేర్ లో ఉన్న సింగూరు కొంత భాగం కాల్వలను ప్రభుత్వం రిపేర్ చేయిస్తలేదని ఆరోపిస్తున్నారు. వర్షాలతో కొంతమేరకు కాల్వల్లో వరద నీరు ప్రవహిస్తున్నా రిపేర్ల కారణంగా వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడటం లేదని అంటున్నారు.

కాల్వలతో నీళ్లియ్యాలె 
ఇక్కడి నేలలన్నీ వరి పంటకు అనుకూలం. కానీ సింగూరు నీళ్లకు ఆశపడి ఇతర పంటలు వేస్తున్నం. సారోళ్లేమో నీళ్లు ఇస్తలేరు. ఈసారైనా సాగునీరు వస్తదని ఆశపడ్డం. కానీ ఇంకా నీళ్లు వదలలే.. ఇప్పటికైనా కాల్వల ద్వారా నీళ్లియ్యాలే.. 
- అంజయ్య, రైతు, పెద్దరెడ్డిపేట

వర్షాలు తగ్గితే నీళ్లు విడుదల చేస్తాం.. 
వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండి వరద నీరు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల తాకిడి తగ్గితే సింగూరు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. 
- రమాదేవి (డిప్యూటీ ఈఈ)