భారీగా పట్టుబడుతున్న నల్లబెల్లం, పటిక

భారీగా పట్టుబడుతున్న నల్లబెల్లం, పటిక
  • ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్న అక్రమార్కులు

  • గుడుంబా రహిత జిల్లా ఉత్తముచ్చటేనా?

మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చామని ఆఫీసర్లు ప్రకటించినా.. జిల్లాలో గుడుంబా మాత్రం గుప్పుమంటోంది. గుడుంబా తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటికను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే 33 టన్నుల నల్లబెల్లం పట్టుబడింది. ఇక తనిఖీలు చేయని రూట్లలో టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక తరలివెళ్తోంది. పోలీసుల కండ్లుగప్పి లారీల కొద్దీ సరుకును పల్లెలకు, తండాలకు చేరవేస్తున్నారు.

ఏపీ నుంచే?

మహబూబాబాద్ జిల్లాకు ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి నల్లబెల్లం, పటిక వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు నుంచే లారీల్లో నేరుగా జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని, మినీ వాహనాల ద్వారా తండాలకు, పల్లెలకు తరలిస్తున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే.. గుడుంబా ఏరులై పారనుంది.

సీరోలులో 25 టన్నులు సీజ్..

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి సెంటర్ వద్ద మంగళవారం 25 టన్నుల నల్లబెల్లం పట్టుబడింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాల ప్రకారం.. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన బానోత్ కృష్ణ , చింతల్ కు చెందిన బదావత్ ​భాస్కర్, బానోత్ మోహన్ ఒక ముఠాగా ఏర్పడి నల్లబెల్లం వ్యాపారం మొదలుపెట్టారు. ఏపీలోని చిత్తూరు నుంచి ఓ లారీలో 500 బస్తాల్లో నల్లబెల్లాన్ని జిల్లాకు తీసుకొచ్చారు. కాంపల్లి సెంటర్ వద్ద టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా.. పోలీసులు ఆ లారీని పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు బానోత్ మోహన్ తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ ను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు బానోత్ కృష్ణ, బదావత్​భాస్కర్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన నల్లబెల్లం విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు.

దంతాలపల్లిలో 25 క్వింటాళ్లు..

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 25 క్వింటాళ్ల నల్లబెల్లం దొరికింది. వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన లకావత్ రాజేశ్.. ట్రాలీ వాహనంలో దంతాలపల్లిలో నల్లబెల్లాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజేశ్​ను అరెస్ట్ చేశారు. ఈ కేసులోనూ బదావత్ భాస్కర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నగూడూరులోనూ సోమవారం 110 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టుబడింది.

తొర్రూరులోనూ..

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. కారులో తరలిస్తున్న  7క్వింటాళ్ల నల్లబెల్లం, 20 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. నెల్లికుదురు మండలం జామతండాకు చెందిన గుగులోత్ సురేశ్​ను అరెస్ట్ చేశారు. గుడుంబాను తయారు చేసినా, ముడి సరుకులు తరలించినా.. చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ వి.శ్రీనివాసులు హెచ్చరించారు.