పూర్వ విద్యార్థుల దాతృత్వం.. ఐఐటీ బాంబేకు రూ.57 కోట్లు అందజేత

పూర్వ విద్యార్థుల దాతృత్వం..  ఐఐటీ బాంబేకు రూ.57 కోట్లు అందజేత

ఐఐటీ- బాంబే.. ఈ విద్యా సంస్థ చాలా ఫేమస్. మరోసారి ఈ సంస్థ వార్తల్లో నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకు చెందిన 1998 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ వేడుకలను ఈ మధ్య జరిగాయి. ఇందులో భాగంగా 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు రూ.57 కోట్ల నిధులు సమీకరించారు. తమకు మంచి జీవితాన్ని ఇచ్చిన అత్యున్నత విద్యా సంస్థకు ఆ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. 

తాము చదువుకున్న విద్యాసంస్థకు విరాళాలు అందజేసే విషయంలో ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్థులు మరోసారి ఆదర్శంగా నిలిచారు. తమ సిల్వర్‌ జూబ్లీ రీయూనియన్‌ సందర్భంగా ఈ సాయానికి ముందుకొచ్చారు. ఒకే బ్యాచ్‌కు సంబంధించి ఇదే అత్యధిక విరాళం కావడం విశేషం. గతంలో 1971 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్‌ జూబ్లీ సంబరాల సందర్భంగా రూ.41 కోట్లు అందజేశారు.

సిల్వర్‌ లేక్‌ ఎండీ అపూర్వ్‌ సక్సేనా, పీక్‌ XV ఎండీ శైలేంద్ర సింగ్‌, వెక్టార్‌ క్యాపిటల్‌ ఎండీ అనుపమ్‌ బెనర్జీ, గూగుల్‌ డీప్‌మైండ్‌కు చెందిన దిలీప్‌ జార్జ్‌ వంటి 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఇందులో భాగమయ్యారు. 

రానున్న మూడేళ్ల నుంచి నాలుగేళ్లలో రూ.57 కోట్లు అందజేస్తామని పూర్వ విద్యార్థులు చెప్పారు. హాస్టళ్లను అప్‌గ్రేడ్ చేయడానికి, కొత్త ఏఐ ల్యాబ్‌ ఏర్పాటు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం ఈ ఫండ్‌ను వినియోగించాలని కోరారు.

ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఈ విరాళం సాయపడుతుందని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశీష్‌ చౌధురి తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి 50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ బాంబే’ను నిలపాలనే లక్ష్యానికి పూర్వ విద్యార్థుల చొరవ సహకరిస్తుందన్నారు. 

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, ఇతర పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఈ విరాళానికి ముందుకొచ్చినట్లు 1998 బ్యాచ్‌కు చెందినవారు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ‘ఐఐటీ బాంబే’ను ప్రపంచ ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిపేందుకు, ఇతర పూర్వ విద్యార్థులను కూడా దాతృత్వ సహకారం దిశగా మళ్లించేందుకు తమ ప్రయత్నం సాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.