Vijay Hazare Trophy 2025-26: డబుల్ సెంచరీతో తెలుగు క్రికెటర్ సంచలనం.. మరో ఫ్యూచర్ స్టార్‌ను పట్టేసిన రాజస్థాన్ రాయల్స్

Vijay Hazare Trophy 2025-26: డబుల్ సెంచరీతో తెలుగు క్రికెటర్ సంచలనం.. మరో ఫ్యూచర్ స్టార్‌ను పట్టేసిన రాజస్థాన్ రాయల్స్

విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడు అమన్ రావు పేరాల డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. మంగళవారం (జనవరి 6) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ హైదరాబాద్ ఓపెనర్ 154 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అమన్ రావ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 13 సిక్స్ లు ఉన్నాయి. ఫోర్లు, సిక్సర్లతోనే 126 పరుగులు రాబట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది 9 వ డబుల్ సెంచరీ కావడం విశేషం. 

ఈ 21 ఏళ్ళ యువ క్రికెటర్ డబుల్ సెంచరీ గాలివాటం అనుకుంటే పొరపాటే. ఎందుకుంట పటిష్టమైన బౌలింగ్ ఉన్న బెంగాల్ పై అమన్ రావు  పరుగుల వరద పారించాడు. షమీ, ఆకాష్ దీప్, ముకేశ్ కుమార్, ఆకాష్ దీప్, షాబాజ్ లాంటి బౌలింగ్ దళంపై ఈ యువ క్రికెటర్ ఆధిపత్యం చూపించాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అమన్ రావ్ ప్రారంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝులిపించాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉండి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అమన్ రావ్ ఇన్నింగ్స్ తో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.     

ఐపీఎల్‌లో రాజస్థాన్ కు మరో ఫ్యూచర్ స్టార్‌:

ఐపీఎల్ లో అమన్ రావు పేరాల రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమన్ రావ్ ను రూ.30 లక్షలకు రాజస్థాన్ సొంతం చేసుకుంది. 2025 మెగా ఆక్షన్ లో వైభవ్ సూర్యవంశీని తీసుకున్న తర్వాత ఈ 14 ఏళ్ళ యువ క్రికెటర్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాడో తెలిసిందే. 2026 మినీ వేలంలో టాలెంటెడ్ అమన్ రావ్ ను తీసుకుంటే డబుల్ సెంచరీతో చెలరేగాడు. వైభవ్, అమన్ రావ్ లతో పాటు రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ లాంటి ఆటగాళ్లు రాజస్థాన్ జట్టులో ఉండడంతో ఫ్యూచర్ సేఫ్ గా ఉంది.