అమర్ రాజాకు సహకరిస్తం

అమర్ రాజాకు సహకరిస్తం

 
 సీఎం రేవంత్ రెడ్డి
 కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ తో చర్చలు
 4,500 మందికి ఉద్యోగాలు దక్కే చాన్స్

 తెలంగాణలో అమర్​రాజా సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా  ఉపాధి లభిస్తుంది. 

ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై సెక్రటేరియట్​లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు.  ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర రాజా కీలక భాగస్వామి అని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు.

 అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఇ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, అడ్వాన్డ్స్ కెమిస్రీ సెల్ వంటి అధునాతన స్టోరేజీ టెక్నాలజీలకు, కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.