అమరనాథ యాత్రకు బ్రేక్.. శివయ్యా ఏంటయ్యా ఇదీ

అమరనాథ యాత్రకు బ్రేక్.. శివయ్యా ఏంటయ్యా ఇదీ

జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బల్తాల్, పహల్గాం మార్గాల్లో యాత్రను టెంపరరీగా ఆపివేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

"ప్రస్తుతం యాత్రను నిలిపివేశాం. పవిత్ర గుహ మందిరం వైపు వెళ్ళేందుకు యాత్రికులెవరికీ అనుమతి లేదు" అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పహల్గామ్ బేస్ క్యాంప్‌కు వెళ్లే 4 వేల 600 మంది యాత్రికుల బ్యాచ్ ను చందర్‌కోట్‌లో నిలిపివేశారు. అంతకుముందు జూలై 6న 17వేల 202 మంది యాత్రికులు పవిత్ర గుహ మందిరానికి పూజలు చేశారు. ఇప్పటివరకు 84వేల మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రలో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.

దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని 3వేల 888 మీటర్ల ఎత్తైన గుహ పుణ్యక్షేత్రానికి 62 రోజుల వార్షిక తీర్థయాత్ర జూలై 1 నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియనుంది.