హత్యానేరంలో కీలకంగా మారిన ‘బ్లూటూత్ స్పీకర్’

హత్యానేరంలో కీలకంగా మారిన ‘బ్లూటూత్ స్పీకర్’

ఎక్కడైనా ఏదైనా హత్య జరిగితే దానికి మనుషులో, ఫోటోలో లేకపోతే వీడియోలో సాక్ష్యాలుగా నిలుస్తాయి.. కానీ, ఇక్కడ మాత్రం ఊహించని విధంగా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు సాక్ష్యంగా మారింది. ఆ సంఘటన ఫ్లోరిడాలోని హలాండేల్ బీచ్‌లో చోటుచేసుకుంది.

ఫ్లోరిడాలో ఆడమ్ క్రెస్పో, సిల్వియా గాల్వా క్రెస్పో అనే దంపతులు నివసిస్తున్నారు.  వారిరువురు జూలై నెలలో  ఒకరోజు రాత్రి ఏదో ఒక విషయమై వాదించుకొని గొడవపడ్డారు. ఆ గొడవలో ఆడమ్ తన భార్యను ఒక ఈటేతో పొడిచాడు. దాంతో అతని భార్య సిల్వియా తీవ్ర రక్తస్రావం జరిగి మరణించింది.  దాంతో ఆడమ్‌పై సెకండ్ డిగ్రీ కేసు నమోదైంది, కానీ ఆడమ్ మాత్రం తన భార్యను హత్య చేసినట్లుగా ఒప్పుకోవడంలేదు, ఎందుకంటే ఆ హత్యను చూసినవాళ్లేవరూ లేరు.

అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు అనూహ్యంగా ఓ ఆలోచన తట్టింది. అదేంటంటే ఆడమ్ ఇంట్లో అమెజాన్ ఎకో డివైజ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించిన ఏదైనా సమాచారం ఆ బ్లూటూత్ డివైజ్‌లో లభిస్తుందేమోనని ఆలోచన వచ్చింది.

పోలీసులకు అసలు ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే.. అమెజాన్ అలెక్సా డివైజ్‌లు ‘వేక్’ అనే ఊతపదంతో కూడా యాక్టివేట్ అవుతాయి. అందువల్ల హత్య జరిగిన సమయంలో ఈ డివైజ్ అక్కడే ఉండటంతో, హత్యకు సంబంధించి ఏదో ఒక క్లూ అందులో రికార్డు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకే అనుకున్నదే తడవుగా పోలీసులు ఆ డివైజ్‌ను పరిశీలించగా అందులో కొన్ని మాటలు రికార్డ్ అయినట్లుగా గుర్తించారు. దాంతో ఆ డివైజ్‌లోని మాటలను విశ్లేషించడానికి ఆ డివైజ్‌ని పరిశీలనకు పంపించారు.

అయితే ఈ హత్యకు సంబంధించి ఆడమ్ మాత్రం ఈ విధంగా చెబుతున్నాడు.  తాను, తన భార్య గొడవపడినప్పుడు అనుకోకుండా 12 ఇంచుల బ్లేడ్ సిల్వియా ఛాతీ భాగంలో గుచ్చుకుందని, అప్పుడు తాను ఆ బ్లేడ్‌ను బయటకి తీయడానికి ప్రయత్నించానని చెప్పాడు. అయితే ఆ గాయంతో సిల్వియా తీవ్రంగా గాయపడుతుందని తాను అనుకోలేదని ఆడమ్ చెప్పాడు.  కాగా పోలీసులు మాత్రం ఆ గాయం కారణంగానే సిల్వియాకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు.  అయితే సిల్వియా ఛాతీ నుంచి ఆ ఈటేను ఆడమ్ బయటకు తీశాడా లేక ఆమె స్నేహితురాలు తీసిందా అనేది మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు.

ఏది ఏమైనా హత్యానేరం కింద అరెస్టయిన ఆడమ్ మాత్రం తాను ఈ హత్య చేయలేదని వాదిస్తున్నాడు.  కాగా, కోర్టు ఆడమ్‌ని 65,000 డాలర్ల పూచికత్తుతో విడుదలచేసింది. అయితే ఆడమ్ ఈ హత్య చేశాడా లేదా అనే విషయం తేలాలంటే మాత్రం అలెక్సా డివైజ్‌లో రికార్డయిన మాటలే ఈ హత్యకు కీలకం.