ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్​ గేట్స్​

ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్​ గేట్స్​

పడిపోయిన జెఫ్​ బెజోస్​ ర్యాంకు

వాషింగ్టన్: అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్‌‌‌‌ ప్రపంచ కుబేరుడి కిరీటం పోగొట్టుకున్నారు. అమెజాన్ ఇంక్ క్యూ3 ఫలితాలు ఆశించిన మేర రాకపోవడంతో, కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో అతలాకుతలమయ్యాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌‌‌‌లోనే అమెజాన్‌‌‌‌ షేర్లు 9 శాతం మేర పడిపోయాయి. దీంతో బెజోస్ సంపద 103.9 బిలియన్ డాలర్లకు(రూ.7,36,936 కోట్లకు) దిగొచ్చింది. బెజోస్ పడిపోవడంతో, మైక్రోసాఫ్ట్‌‌‌‌ కో–ఫౌండర్ బిల్‌‌‌‌ గేట్స్ ముందుకొచ్చారు. 105.7 బిలియన్ డాలర్లు(రూ.7,49,703 కోట్లు) సంపదతో బిల్‌‌‌‌ గేట్స్ మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. గేట్స్ నెంబర్ వన్‌‌‌‌ స్థానాన్ని దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ కుబేరుడి పీఠాన్ని 24 ఏళ్ల పాటు ఏలుతూ వస్తోన్న బిల్‌‌‌‌ గేట్స్‌‌‌‌కు తొలిసారి జెఫ్ బెజోస్ 2018లో చెక్ పెట్టారు. 160 బిలియన్ డాలర్ల(రూ.11,34,312 కోట్ల) సంపదతో నెంబర్ వన్ స్థానానికి వచ్చారు. ఈ జూలైలో బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ముందుకు రావడంతో, గేట్స్ నెంబర్ 3 స్థానానికి పడిపోయారు. కానీ మళ్లీ గేట్స్‌‌‌‌ తాజాగా నెంబర్ 1 లోకి వచ్చేశారు. గేట్స్ తొలిసారి 1987లో 1.25 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌‌‌‌లో స్థానం సంపాదించుకున్నారు. బెజోస్‌‌‌‌ 1998లో అంటే అమెజాన్‌‌‌‌ ఐపీఓకు వచ్చిన ఏడాదికి ఫోర్బ్స్ 400 రిచెస్ట్ అమెరికన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు ఆయన సంపద 1.6 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.

తొలిసారి తగ్గిన లాభాలు…

అమెజాన్ నికర ఆదాయం ఈ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 26 శాతం తగ్గిపోయింది. 2017 తర్వాత లాభాలు పడిపోవడం ఇదే తొలిసారి అని ఫోర్బ్స్ ప్రకటించింది.  ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత అమెజాన్ షేర్లు సుమారు 9 శాతం మేర పడిపోయి ఒక్కో షేరు 1,624 డాలర్లకు పడిపోయాయి. కేవలం క్వార్టర్లీ ఫలితాలు పడిపోవడమే కాక, బెజోన్ నికర సంపదలో 4 శాతం వాటా తన మాజీ భార్యకు వెళ్తోంది.