
Amazon Now: భారతదేశంలో ప్రస్తుతం క్విక్ కామర్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇంటికి అవసరమైన కిరాణా సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటినీ చాలా సంస్థలు డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ నౌ, కంట్రీడిలైట్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎక్కువ కస్టమర్ బేస్ సంపాదించాలని కోట్లు కుమ్మరిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ పోటీలోకి ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అడుగుపెట్టింది. అత్యంత వేగంగా తక్కు సమయంలో సరుకులను ప్రజలకు అందించేందుకు అమెజాన్ నౌ పేరుతో తన సేవలను బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. డిసెంబరులో దీనిపై పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రెండు నుంచి మూడు రోజుల్లో సరుకుల డెలివరీ కోరుకున్న భారతీయులు ప్రస్తుతం కొన్ని నిమిషాల్లో డెలివరీలు కోరుకోవటంతో ఈ రంగంలోకి అమెజాన్ ఎంట్రీ అనివార్యంగా మారిపోయింది.
రానున్న కొద్ది వారాల్లో ఈ సేవలను బెంగళూరులో మరింతగా విస్తరించే దిశగా అమెజాన్ కొనసాగుతోంది. తర్వాత చిన్నగా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటికీ విస్తరించే దిశగా కంపెనీ ప్లాన్ చేస్తోంది. క్విక్ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం ఈకామర్స్ వ్యాపార వాటాను ఆక్రమిస్తున్న తరుణంలో అమెజాన్ క్విక్ కామర్స్ ఎంట్రీ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం భారతీయులు మెుత్తం ఆన్ లైన్ కిరాణా స్పెండింగ్ లో మూడో వంతు, ఈ రిటైల్ల లో 10 శాతం క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమించాయని వెల్లడైంది.
ప్రస్తుతం భారతీయ క్విక్ కామర్స్ వ్యాపారంలో 46 శాతం వాటాను బ్లింకిట్, 29 శాతం వాటాను జెప్టో, 25 శాతం వాటాను స్విగ్గీ ఇన్స్టమార్ట్ కలిగి ఉన్నట్లు దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.2030 నాటికి ఈ వ్యాపారం ఏటా 40 శాతం వేగంతో అభివృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి.